జోరుగా చెట్ల నరికివేత
♦ మితిమీరుతున్న కలప వ్యాపారుల ఆగడాలు
♦ పచ్చదనాన్ని మటుమాయం చేస్తున్న వైనం
♦ కరువు విలయ తాండవం చేస్తున్నా పచ్చని చెట్లను వదలని అక్రమార్కులు
♦ చోద్యం చూస్తున్న అధికారులు
మెదక్: కరువు కాటకాల నివారణకు ఏకైక ఆయుధం చెట్లు పెంచడమేనని పాలకులు పదే పదే చెబుతూ హరితహారం పథకం ప్రారంభించారు. కానీ అక్రమ కలప వ్యాపారుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఎక్కడ చెట్టు కనిపించినా అక్కడ గబ్బిలంలా వాలిపోయి రైతులకు ఎంతో కొంత ముట్టజెప్పి గంటల వ్యవధిలో నేల కూలుస్తున్నారు. ఓ పక్క కరువు విలయ తాండవం చేస్తున్నా ఊరుకోని వ్యాపారులు ఈ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చిన్నశంకరంపేట, బొల్లారం, గుమ్మడిదల, చేగుంట, జిన్నారం, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలకు కలప అవసరం ఉండడంతో జిల్లాలోని చెట్లన్ని ఇబ్బడి ముబ్బడిగా నరికేస్తున్నారు.
ఈ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఊరూరా కలప వ్యాపారులను తయారు చేసి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఈ పచ్చదనంపైకి ఉసిగొల్పుతున్నారు. అసలే కరువు, కాటకాలతో విలవిలలాడుతున్న అన్నదాతలు పైసా సంపాదించే దారిలేక వారిచ్చే ఎంతో కొంత డబ్బులు తీసుకొని పొలం గట్లపైనున్న చెట్లను అమ్ముతున్నారు. దీంతో అక్రమ కలప వ్యాపారులు మామూళ్లతో అధికారుల నోళ్లు మూయించి తమ దందాను మూడు చెట్లు, ఆరు లారీలు అన్న చందంగా కొనసాగిస్తున్నారు. గడిచిన రెండునెలలుగా మెదక్ మండలంలోని ఫరీద్‌పూర్, జక్కన్నపేట, సర్ధన, ముత్తాయిపల్లి, కూచన్‌పల్లి తదితర గ్రామాల శివారులో నుంచి నిత్యం పదుల సంఖ్యలో కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ తతంగమంతా ఫారెస్ట్ అధికారుల కళ్లముందే జరుగుతున్నా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా మూడు రోజులుగా మెదక్ మండలం ఫరీద్‌పూర్ గ్రామ శివారులోని చెట్లను నరుకుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు పాలకులు హరితహారం పథకంలో మొక్కలు నాటాలని ప్రచారం చేస్తోంటే అధికారులు మాత్రం దగ్గరుండి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కలప వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలవాసులు కోరుతున్నారు. ఈ విషయంపై ఇన్‌చార్జి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా విషయం మా దృష్టికి రాలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.