– భారీగా ఆర్టీఏ కార్యాలయ రికార్డులు స్వాధీనం
– నిందితుల్లో ఓ హోంగార్డు పాత్ర
అనంతపురం సెంట్రల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నకిలీ పాసుపుస్తకాల కుంభకోణం’లో ఉన్న నిందితులు మరో స్కాం చేస్తూ వన్‌టౌన్ పోలీసులకు పట్టుబడినట్లు తెలిసింది. గురువారం నగరంలో బీమా లాడ్జిలో ఫోర్జరీ ముఠా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు లాడ్జిపై దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బత్తలపల్లికి చెందిన పాసుపుస్తకాల కుంభకోణంలో కీలక నిందితుడు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఓ హోంగార్డు కూడా జతకలిశాడు. ఇటీవల ఆర్టీఏ కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలు చేసి కోర్టును తప్పుదోవ పట్టించాడనే కారణంతో ఆర్టీఏ అధికారులు సదరు హోంగార్డును పోలీసుశాఖకు సరెండర్ చేశారు.
అయితే మళ్లీ సదరు హోంగార్డు ఫోర్జరీ ముఠాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయ రికార్డులను వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పాసుపుస్తకాల తయారీ నిందితునికి నార్కో పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సదరు నిందితులు వన్‌టౌన్ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. అయితే వారు మాత్రం తాము ఎలాంటి తప్పూ చేయలేదని అంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఏ కార్యాలయానికి చెందిన కొన్ని రికార్డులను తీసుకున్నట్లు తెలిపారు. అంతమాత్రాన ఫోర్జరీ చేసినట్లా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం వీటిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
పోలీసుల అదుపులో ఫోర్జరీ రాకెట్ ముఠా!
Published Fri, Jul 21 2017 10:43 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement