సీఎం గారూ.. వంకర మాటలు తగ్గించండి
కాపులకు రిజర్వేషన్ల హామీ మీరిచ్చిందే
అమలు చేయమంటే ఎదురుదాడి చేయిస్తారా?
కమిషన్ రిపోర్టు చూడటానికి మరుజన్మ ఎత్తాలి..
చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ లేఖ
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కిర్లంపూడి: ‘కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ ఎన్నికల్లో మీరిచ్చిందే. దాన్ని అమలు చేయాలని అడుగుతుంటే నేరం ఎవరి మీదకో తోసివేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య కాదా? ఎదురుదాడి చేయించడం లోకానికి తెలియదా? మా ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారని మీరు అంటున్నారు.. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను చేసిన ఉద్యమాలన్నీ మీ మద్దతుతో చేసినవా? సీఎం గారూ వంకర మాటలు తగ్గించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు. సీఎం ద్వంద్వవైఖరిని దుయ్యబడుతూ మంగళవారం రెండు పేజీల లేఖను పంపించారు.
అన్నీ సిద్ధంగా ఉన్నా కాలయాపన..
అన్ని రకాల గణాంకాలు, సర్వేలు, వెలుగు సర్వేలు, కులాలు, జనాభా గణాంకాలు, ఆస్తిపాస్తుల వివరాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నప్పుడు మళ్లీ కమిషన్ వేయడం కేవలం కాలయాపన చేయడానికేనని ముద్రగడ ఆక్షేపించారు. ఆ కమిషన్ రిపోర్టు చూడాలంటే మరుజన్మ ఎత్తాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే నెల రోజుల్లో ఆ హామీని సీఎం అమలు చేయవచ్చని పేర్కొన్నారు. లేదంటే వచ్చే నెల 31న తునిలో నిర్వహించనున్న కాపుల సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేస్తామని ముద్రగడ తన లేఖలో స్పష్టం చేశారు.
అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. కాపు జాతిని మోసం చేసేందుకు బాబు కుట్ర పన్నుతున్నారని, రాజకీయాలు, రాష్ట్రం చంద్రబాబు సొత్తు కాదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో కాపులకు బీసీ రిజర్వేషను కల్పిస్తామని, ఏటా రూ.1000 కోట్లతో అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
మా వాటా కావాలని అడుగుతున్నాం..
తమ ఉద్యమం రాజ్యాధికారం కోసం కాదని, అత్యంతపేదవారి కోసమేనన్నారు. గిరిజన, హరిజన, వెనుకబడిన వర్గాలు అనుభవించే కోటా కాకుండా మిగిలిన దాంట్లో తమకు వాటా కావాలని అడుగుతున్నామన్నారు. ఆకలి తీరుస్తామని హామీ ఇచ్చారు కనేకనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ‘స్వాతంత్య్రం రాకముందు బలిజ, ఒంటరి, తెలగ, కాపు కులాలు బీసీలుగా ఉన్నారట. అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి ఓసీలుగా మార్పు చేయడం, దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య మళ్లీ బీసీలుగా మార్చడం, తర్వాత అప్పటి సీఎం బ్రహ్మానందరెడ్డి ఓసీలుగా మార్పు చేశారని, ఈ కార్యక్రమంతా జీవోల ద్వారానే అమలు చేశారని పెద్దల వల్ల తెలుస్తోంది.’ అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.