ఆహ్వానం పేరుతో.. కేసీఆర్ దగ్గర మోకరిల్లారు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'ఓటుకు కోట్లు' కేసు నుంచి బయటపడేందుకే ఆయన ప్రత్యేక హోదాను అమ్మేశారని ఆరోపించారు. కేసు నుంచి తప్పించుకోడానికే ఆహ్వానం పేరిట చంద్రబాబు వెళ్లి కేసీఆర్ దగ్గర మోకరిల్లారని అన్నారు. రాజధాని శంకుస్థాపనను చంద్రబాబు తన కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారని, లోకేశ్ పట్టాభిషేకం కోసమే రాజధాని హంగు, ఆర్భాటాలు చేశారని అన్నారు.
రాజధాని శంకుస్థాపనలో కేవలం ఒక సామాజిక వర్గాన్ని మాత్రమే భాగస్వామిగా చేశారని, ప్రజల డబ్బును మంచినీళ్ల కంటే దారుణంగా ఖర్చుపెట్టారని ముద్రగడ పద్మనాభం విమర్శించారు. భూసేకరణ, సమీకరణ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని అన్నారు. రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించడంపై ప్రధానమంత్రి దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇక ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించకపోవడం ఏపీ ప్రజలను అవమానపరచడమేనని పద్మనాభం వ్యాఖ్యానించారు.