
మాజీ మంత్రికి కన్నీటి వీడ్కోలు
పగిడ్యాల : మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి(88)కి రాజకీయ ప్రముఖులు, అభిమానులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం రాత్రి ఆయన కర్నూలులో గుండెపోటుతో మరణించగా శుక్రవారం స్వగ్రామం ముచ్చుమర్రిలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో భారీగా జనం తరలి రావడంతో ముచ్చుమర్రి జనసంద్రంగా మారింది. సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని సొంత పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. సీఐ శ్రీనాథరెడ్డి, ముచ్చుమర్రి ఎస్‌ఐ, పీఎస్‌ఐ నరసింహులు, జూపాడుబంగ్లా ఎస్‌ఐ సుబ్రమణ్యం, ఏఎస్‌ఐ అబ్దుల్ అజీజ్ సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టారు.
ప్రముఖల నివాళి:
బైరెడ్డి శేషశయనారెడ్డి మరణ వార్తను తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు ముచ్చుమర్రి చేరుకుని ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నందికొట్కూరు, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు వై.ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బీవీ జయనాగేశ్వరరెడ్డి కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి, మాజీ మేయర్లు రఘునాథ్‌రెడ్డి, బంగి అనంతయ్య, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ, వైఎస్సార్‌సీపీ నాయకులు వై.చంద్రమౌళి, సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షడ్రక్, జిల్లా అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, సీపీఐ డివిజన్ కార్యదర్శి రఘురాం మూర్తి ఇతర ప్రముఖులు బైరెడ్డి కుటంబ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి మల్లికార్జునరెడ్డి, బైరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపి ఘనంగా నివాళ్లు అర్పించారు.