
కాపుల కార్పొరేషన్‌కు అసమర్థుడి నియామకం
మాజీ ఎంపీ హరిరామజోగయ్య
పాలకొల్లు టౌన్: తునిలో జరిగే కాపు గర్జన విజయవంతం కాకముందే ఎలాంటి భేషజాలకు లోనుకాకుండా కాపుల డిమాండ్లపై సీఎం చంద్రబాబు నోరువిప్పడం ఆ పార్టీకి శ్రేయస్కరమని మాజీ ఎంపీ హరిరామజోగయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపులు ఒకతాటిపైకి వచ్చి చంద్రబాబు చూపిస్తున్న ఉదాసీనతపై నిరసన తెలపాలని నిర్ణయించిన తరుణంలో కాపులకు కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ. 100 కోట్లు కేటాయించారని విమర్శించారు.
ఆ కార్పొరేషన్‌కి టీడీపీకి చెందిన అసమర్థుడిని చైర్మన్‌గా నియమించడం వల్ల కాపు కులస్తులు సంతృప్తి చెందలేద నే విషయాన్ని చంద్రబాబు గ్రహించాలన్నారు. గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న కాపు యువకులకు నెలకు రూ. 1,500 నుంచి రూ. 2 వేలు నిరుద్యోగ భృతిగా కార్పొరేషన్ ద్వారా అందజేయాలన్నారు.