బాధ్యత... భరోసా
-
సామాజిక సేవలో పోలీసులు
-
జనమైత్రి ద్వారా జనంతో మమేకం
-
జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
చెన్నూర్ : ఖాకీ చొక్కా తొడిగి ధర్మాన్ని కాపాడుతారు. లాఠీ పట్టి నేరస్తుల బెండు తీస్తారు. తలపై ధరించిన టోపీలోని సింహాల్లా సమాజంలోని మానవ మృగాల బారి నుంచి సామాన్యులను రక్షిస్తారు. 24 గంటలు 7 రోజులు 365 రోజులు శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమవుతారు. సమాజాన్ని డేగ కన్నులతో పహారా కాస్తారు. పీ ఫర్ పోలీస్... పోలీస్ ఫర్ పబ్లిక్.. జనంతో మమేకమవుతున్న పోలీసులపై ఈ కథనం.
ప్రజల సేవలో మేము సైతం అంటూ ‘జనమైత్రి’ పోలీసులు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నిన్న మొన్నటి వరకు పోలీసులు మీకోసం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసులు మీలో ఒకరేననే కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. పోలీసులు శాంతి భద్రతలతో పాటు సామాజిక సేవకులని చాటి చెప్పేందుకు నేడు జనమైత్రి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికో జనమైత్రి పోలీసు అధికారిని నియమించారు. ఆయా గ్రామాల్లో జనమైత్రి గ్రామసభలు నిర్వహించి ప్రజలను అన్ని రకాలుగా చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా పయనించాలని ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తున్నారు.
సమస్యల పరిష్కారం సత్వరమే
గ్రామాలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు జనమైత్రి పోలీసు అధికారి దృష్టికి తీసుకొని వస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. గ్రామ అభివద్ధికి ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నప్పటికీ ఇతర అభివృద్ధి పనుల్లో జనమైత్రి పోలీసు అధికారులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.
యువతకు ప్రోత్సాహం
గ్రామాలలోని నిరుద్యోగ యువతపై జనమైత్రి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అన్ని ఉండి అవకాశాలు లేక నిరుత్సాహంలో ఉన్న యువతను ప్రోత్సహిస్తున్నారు. వారి లోని ప్రతిభను వెలికితీసేందుకు పలు పోటీలను నిర్వహిస్తున్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని గ్రామస్తులను కోరుతున్నారు. గుడుంబా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారు.