నిఘా నేత్రం.. కట్టుదిట్టం | public security is under surveillance | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రం.. కట్టుదిట్టం

Published Fri, Feb 9 2018 3:52 PM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

public security is under surveillance - Sakshi

అలంపూర్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైని

అలంపూర్‌ రూరల్‌ : ప్రజాభద్రతే లక్ష్యంగా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే అలంపూర్‌ స్టేషన్‌ పరిధిలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించామని కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం అలంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో వారు సీసీల కెమరాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పోలీస్‌ యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందని ప్రజలనుంచి ప్రశంసలు వస్తున్నాయని, శాంతి భద్రతల విషయంలో అందరికీ ఒకేగాడిన పెడుతున్నామన్నారు.

ఇకపై నియోజకవర్గ కేంద్రంలో జరిగే ప్రతి కదలికను పోలీసులు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. నివేదన యాప్‌ జిల్లా ప్రజల కోసమే తీసుకొచ్చామని, ఏ సమస్య అయినా క్లిప్పింగ్‌లు, ఫొటోలు పంపిస్తే పరిష్కరిస్తామన్నారు. అనంతరం నేతాజీ ఫ్రెండ్స్‌ చైతన్య సేవాసమితి కార్యదర్శి వెంకట్రామయ్య శెట్టి ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్, ఎస్పీలను మెమోంటోలతో గౌరవించారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేందర్‌రావు, డీఆర్‌వో వేణుగోపాల్‌రావు, సీఐ రజిత, ఎస్‌ఐ వాసా ప్రవీన్‌కుమార్‌ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
  
ప్రణాళికా బద్ధ్దంగా చదివితేనే ఉత్తమ గ్రేడ్‌  
గద్వాల అర్బన్‌: పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివితే మంచిమార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని  కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైని అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర, ఆనంద నిలయంలో కలెక్టర్‌ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు, తివాచీలు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్షలంటే  ఆందోళనకు గురికావద్దని, ఏకాగ్రతతో చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఉన్నత చదువులకు పదవ తరగతి తొలిమెట్టని, తల్లిదండ్రుల కలలు, ఆకాంక్షలను నెరవేర్చేలా కష్టపడి చదవాలన్నారు.  వార్డెన్లు కూడా టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం నాణ్యతతో భోజనం పెట్టించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్ల అధికారి రాములు పాల్గొన్నారు.  

సమగ్ర నివేదిక తయారుచేయాలి : జోషి
సాక్షి, గద్వాల: సమగ్ర భూ సర్వే అనంతరం రైతులకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉన్నందున జిల్లాలో ఖాతానెంబర్లు, ఫొటోలు, ఆధార్‌కార్డు నెంబర్లు అన్నీ సరిపోయేటట్లు సమగ్ర నివేదిక తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సచివాలయం నుంచి కలెక్టర్లతో మాట్లాడారు. మార్చిలో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలను జారీ చేసేవరకు ఎలాంటి పొరపాట్లు లేకుండా నివేదికలు కంప్యూటరీకరించి పంపాలన్నారు. కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, ప్రత్యేక కలెక్టర్‌ కరుణ, సంయుక్త కలెక్టర్‌ సంగీత పాల్గొన్నారు. 
  
దళారుల ఆటలు కట్టించండి : పార్థసారధి 
గద్వాల అర్బన్‌: కంది పంట రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఎఫ్‌సీఐ, హాకా సంస్థల ద్వారా కొనుగోలు చేస్తుంటే దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జీఏడీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి  కలెక్టర్లతో సమీక్షించారు. ప్రభుత్వం కందులకు రూ.5,450 మద్దతు ధర కల్పిస్తోందని, దళారులు గోదాముల్లో నిల్వ ఉంచిన కందులు, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన కందులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలతో అమ్ముతున్నట్లు తెలిసిందని, తక్షణమే దాడులు నిర్వహించి వారి ఆట కట్టించాలని ఆదేశిం చారు. అనంతరం కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 1.5లక్షల క్వింటాళ్ల కందులు దిగుబడి కాగా దాదాపు 50శాతం కందులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. వీసీలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ సంగీత, మార్కెట్‌ శాఖ అధికారిణి పుష్పలత, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్‌  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement