ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు, చివరకు నారాయణ కళాశాల విద్యార్థులతో పాటు పార్టీ నేతలు కొందరు జగన్ పాదయాత్రపై రోజూ నివేదికలు తయారుచేస్తున్నారు. ఆ నివేదికలను ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాటిపై సీఎం చంద్రబాబు ప్రతి రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్పం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో రోజూ రీజనల్ ఇంటెలిజెన్స్ ఆర్‌ఐవో నరహరి పాల్గొంటున్నారు. వైఎస్ జగన్ వెళ్లే ప్రాంతానికి ముందుగానే ఆయన చేరుకుని అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించడంతో పాటు ప్రజా స్పందనపై ఆరా తీస్తున్నారు. అక్కడక్కడా ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. ఆయా ప్రాంతాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర ముగిశాక కూడా జనం ఏమనుకుంటున్నారనే దానిపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి అయిన నరహరితో పాటు మరికొందరు అధికారులు జనంలో కలిసి సీఎం చంద్రబాబు ప్రభుత్వం పట్ల ఎవరెవరు ఏమనుకుంటున్నారనేదానితో పాటు వైఎస్ జగన్ ఇస్తున్న హామీలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
నిఘా కెమెరాలతో పోలీసులు
పాదయాత్ర మొదటిరోజు కనిపించని నిఘా కెమెరాలు మూడో రోజు నుంచి పోలీసుల చొక్కాలకు వేలాడుతూ కనిపించాయి. వైఎస్ జగన్ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి ప్రభుత్వం నిఘాను పెంచింది. యాత్రకు ఏయే వర్గాల ప్రజలు వస్తున్నారు? ఎవరెవరు జగన్‌ను కలుస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను నేరుగా చూసేందుకు ప్రభుత్వం పోలీసుల ఖాకీ చొక్కాలకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాలను తగిలించుకున్న పోలీసులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వచ్చే జనాన్ని చిత్రీకరిస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవరైనా వైఎస్ జగన్‌ను కలుస్తున్నారా? అనే విషయం తెలుసుకునేందుకు ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కర్నూలుకు చెందిన ఓ సీనియర్ నాయకుడు తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు డ్రోన్ కెమెరాలతో బహిరంగ సభ దృశ్యాలతో పాటు పాదయాత్రలో భారీగా తరలివస్తున్న జనాలను చిత్రీకరిస్తున్నారు.
అమరావతిలో ‘లైవ్’
బహిరంగ సభతో పాటు రోజూ పాదయాత్రకు పోటెత్తుతున్న జనాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నదంతా సచివాలయంలో ప్రభుత్వ పెద్దలు నేరుగా ‘లైవ్’లో చూస్త్ను్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు జగన్ పాదయాత్రపై రోజూ సాయంత్రానికల్లా నివేదిక సిద్ధం చేసి ఆయా శాఖల ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నారాయణ విద్యా సంస్థల్లోని కొందరు విద్యార్థులను సైతం వినియోగిస్తున్నట్లు తెలిసింది. వీరు సేకరించిన సమాచారాన్ని నేరుగా మంత్రికే పంపుతున్నట్లు ప్రొద్దుటూరులో శనివారం రాత్రి జరిగిన వైఎస్ జగన్ బహిరంగసభ వద్ద చర్చించుకోవడం కనిపించింది.
సీఎంకు నివేదిక..
వివిధ శాఖలు, ప్రైవేటు వ్యక్తులు జగన్ పాదయాత్రపై సేకరించి అమరావతికి పంపిన నివేదికను ఉన్నతాదికారులు సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారు. రోజూ తెప్పించుకుంటున్న నివేదిక, వీడియోలను సీఎం స్వయంగా చూడటంతో పాటు.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆ నివేదికపై రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభలకు, పాదయాత్రకు అనూహ్యంగా వచ్చిన జనం, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలపై శుక్ర, శనివారాల్లో సీఎం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత.. దానికిగల కారణాలపై విశ్లేషించినట్లు ఓ అధికారి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment