13 నుంచి నిడదవోలు రైల్వే గేటు మూసివేత
నిడదవోలు: రాజమండ్రి-తాడేపల్లిగూడెం రోడ్డులోని నిడదవోలు రైల్వే గేటును ఈనెల 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్టు రైల్వేస్టేషన్ మేనేజర్ ఆకుల ప్రభాకర్ గురువారం తెలిపారు. రైల్వే గేటు ట్రాక్ ఇరువైపులా మరమ్మతులు, ట్రాక్‌పై రోడ్డు పనుల నిమిత్తం మూడు రోజులు పాటు గేటు మూసివేస్తున్నట్టు చెప్పారు. రైల్వే టెక్నికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన గ్యాంగ్ ట్రాక్ మరమ్మతుల పనులు చేస్తుందన్నారు. ఈ మేరకు వాహనాలను దారి మళ్లించేందుకు ఆర్టీసీ, పోలీస్, రెవెన్యూ అధికారులకు రైల్వే అధికారులు సమాచారం ఇస్తూ నోటీసులు అందించారు. గతేడాది సెప్టెంబర్‌లో రైల్వేగేటు మూసివేసి మరమ్మతులు చేపట్టడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులు గేటు ఒక వైపు, రాజమండ్రి నుంచి నిడదవోలు బస్టాండ్ మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే బస్సులు గేటు మరోవైపు నిలుపుదల చేసి ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. నిడదవోలు నుంచి సింగవరం, తాళ్లపాలెం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లేందుకు పోలీసులు దారిమళ్లింపు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అయితే తాళ్లపాలెం వంతెన వద్ద మూడు మీటర్లు ఎత్తుకన్నా ఎక్కువ ఉన్న వాహనాలను నిషేధిస్తూ రైల్వే అధికారులు గడ్డర్లు ఏర్పాటుచేశారు. దీంతో భారీ వాహనాలు ఇటువైపు వెళ్లేందుకు వీలులేదు.