శంకుస్థాపనకు నేటి నుంచి మట్టి సేకరణ
ప్రతి గ్రామం నుంచి కిలో మట్టి, పావు లీటర్ నీరు సేకరణ
సాక్షి, హైదరాబాద్: రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కిలో మ ట్టి, పావు లీటర్ నీరు చొప్పున ప్రభుత్వం సేకరించనుంది. ఇందుకోసం మంగళవారం నుం చి వారం రోజుల పాటు ‘ప్రజా రాజధాని- మన నీరు-మన మట్టి’ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయించిం ది. నీరు-మట్టి సేకరణ, ర్యాలీగా అమరావతికి వాటి తరలింపునకు సంబంధించిన వారం రోజుల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. మంగళవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో పసుపురంగు సంచిలో మట్టిని అలాగే రాగి పాత్రలో నీటిని సేకరించాలి. గ్రామంలోని ఈశాన్య ప్రాంతంలో మట్టిని సేకరించాలి.
ఆయా గ్రామాల్లోని అన్ని మతాలకు చెందిన దేవాలయాల్లోనూ పూజలు, ప్రార్థనలు నిర్వహించాలి. సేకరించిన మట్టి సంచీలను, నీటి పాత్రలను 16వ తేదీన మండల కేంద్రాలకు, మున్సిపల్ కార్యాలయాలకు తరలించాలి. 17వ తేదీన ర్యాలీగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు చేరుకోవాలి. 18వ తేదీ ఉదయం నియోజకవర్గ కేంద్రాల నుంచి ‘మన రాజధాని అమరావతి-మన నీరు-మన మట్టి’ అని రాసి ఉన్న బ్యానర్లను పట్టుకుని జిల్లా కేంద్రాలకు చేరాలి. జిల్లా కేంద్రాల నుంచి వాహనాల్లో 18 సాయంత్రం గానీ 19వ తేదీ ఉదయం గానీ బయలుదేరి అదేరోజు సాయంత్రం 5 గంటలకు నాగార్జున వర్సిటీకి చేరుకోవాలి.
20వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సిటీ దగ్గర జెండా ఊపి ర్యాలీలను అమరావతికి పంపిస్తారు. 21వ తేదీన దేశంలోని పవిత్ర నదుల నుంచి తీసుకువచ్చిన నీటిని ఈ నీటితో కలుపుతారు. ఆ నీటిని 22న శంకుస్థాపన కార్యక్రమంలోను తర్వాత రాజధాని భవనాల నిర్మాణంలోను వినియోగిస్తారు. గ్రామా ల్లో మట్టి, నీరు సేకరణ సందర్భంగా అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ సంకల్ప పత్రం మీద ప్రజలు సంతకం చేసి సీఆర్‌డీఏకు పంపిస్తారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించే వారిని ప్రభుత్వం ఖరారు చేసింది. ఆహ్వానితుల్లో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్య మంత్రులు, ఢిల్లీలోని అన్ని దేశాల దౌత్యవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఇంటి పండుగలా శంకుస్థాపన వేడుకలు
అమరావతి శంకుస్థాపన వేడుకలను ఇంటి పండుగలా, గ్రామ వేడుకలా ప్రతి ఒక్కరూ భావించి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ నెల 18న అన్ని పట్టణాల్లో 5కె, 10కె రన్‌లలో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.