అగ్రి కోర్సు.. ఫార్సు! | fruad in agri course | Sakshi
Sakshi News home page

అగ్రి కోర్సు.. ఫార్సు!

Published Mon, Sep 12 2016 10:53 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

అగ్రి కోర్సు.. ఫార్సు! - Sakshi

అగ్రి కోర్సు.. ఫార్సు!

కర్నూలులో అనుమతి లేని కాలేజీ
– అగ్రి బీఎస్సీ పేరిట విద్యార్థులకు వల
– యూజీసీ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు
– నకిలీ వర్సిటీ అనుమతి పత్రంతో చెలామణి
– వేలాది రూపాయల ఫీజు వసూలు
– కళ్లు తెరవని విద్యా శాఖ


అసలే ఉద్యోగాల్లేక యువత నిరాశ నిస్పృహల్లో ఉంది. ఇదే అదనుగా ఓ కళాశాల యాజమాన్యం వ్యవసాయాధికారి అయ్యే అవకాశం అంటూ ప్రచారానికి తెరతీసింది. అగ్రి బీఎస్సీ కోర్సు పేరిట విద్యార్థులకు ఎర వేస్తోంది. వాస్తవానికి ఎలాంటి అనుమతి లేకపోయినా యాజమాన్యం నిరుద్యోగుల ఆశలతో వ్యాపారం మొదలుపెట్టింది. జిల్లా కేంద్రంలోనే సాగుతున్న ఈ వ్యవహారం విద్యా శాఖ అధికారుల కళ్లుగప్పి సాగుతుందంటే అనుమానమే.

సాక్షి ప్రతినిధి, కర్నూలు:
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఆయూష్‌ హాస్పిటల్‌ పక్కన ఏర్పాటైన ఓ ప్రై వేట్‌ కాలేజీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. తప్పుడు అనుమతులతో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు పేరిట అడ్మిషన్లు చేస్తూ భారీగా ఫీజు వసూలు చేస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) నుంచి ఇంకా అనుమతి లభించని యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామనే ఓ అగ్రిమెంట్‌ కాపీతో విద్యార్థులను మోసగిస్తోంది. సులభంగా అగ్రి బీఎస్సీ సీటు వస్తుందనే ఆశతో కొద్ది మంది విద్యార్థులు ఇప్పటికే వేలాది రూపాయలు చెల్లించి అడ్మిషన్లు కూడా తీసుకుంటున్నారు. త్వరలో తరగతులను కూడా ప్రారంభిస్తామని యాజమాన్యం నమ్మ బలుకుతోంది. యూజీసీ నుంచి అనుమతి లేని రాజస్తాన్‌లోని సంఘానియా యూనివర్సిటీతో కుదుర్చుకున్నామని చెబుతున్న నాలుగు పేజీల ఒప్పంద లేఖను పట్టుకుని ఏకంగా కాలేజీనే నడుపుతోంది. అనుమతి లేదంటూ హైదరాబాద్‌ నుంచి తన్ని తరిమేసిన కళాశాల కర్నూలులో దుకాణం పెట్టి విద్యార్థులను మోసగించేందుకు సిద్ధమయింది.

యూనివర్సిటీకే దిక్కు లేదు..
వాస్తవానికి ఏదైనా యూనివర్సిటీ కోర్సును ప్రారంభించాలంటే మొదట సదరు యూనివర్సిటీకి యూజీసీ నుంచి అనుమతి ఉండాలి. ఆ యూనివర్సిటీలోని కోర్సులకు కూడా యూజీసీ అనుమతి తప్పనిసరి. అయితే, ఇక్కడ కర్నూలులో ఉన్న కాలేజీ రాజస్తాన్‌లోని సంఘానియా యూనివర్సిటీ అనుమతితో అగ్రి బీఎస్సీ కోర్సును ప్రవేశపెట్టామని చెబుతోంది. వాస్తవానికి రాజస్తాన్‌ రాష్ట్రం ఝుంఝుంను లోని సంఘానియా యూనివక్సిటీకి కూడా యూజీసీ గుర్తింపు లభించలేదు. అంతేకాకుండా యూజీసీ నిపుణుల కమిటీ మరింత సమాచారం కోరింది. ఈ సమాచారాన్ని సదరు యూనివర్సిటీ సమర్పించలేకపోయింది. దీంతో యూజీసీ నిపుణుల కమిటీ కాస్తా ఈ యూనివర్సిటీని ఇప్పటివరకు సందర్శించలేదు. మరోవైపు సింఘానియా యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి స్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి నకిలీ వర్సిటీలతో ఒప్పందం చేసుకున్నామంటూ కొన్ని కాలేజీలు కూడా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అందులో గ్రీన్‌లాండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, సుందర్‌నగర్‌ కాలనీ, సంజీవరెడ్డినగర్‌ కాలనీ మెయిన్‌రోడ్, హైదరాబాద్‌ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అక్కడ బిచానా ఎత్తేసిన ఈ ఇన్‌స్టిట్యూట్‌ కాస్తా ఇప్పుడు కర్నూలు నగరంలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో కాలేజీ యాజమాన్యం వసూలు చేసింది.

ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు..
వాస్తవానికి వ్యవసాయశాఖలో అగ్రి బీఎస్సీ చదివితే అగ్రికల్చర్‌ ఆఫీసర్‌(ఏఓ)గా ఉద్యోగం వస్తుంది. అయితే, ఈ విధంగా ఉద్యోగం రావాలంటే కచ్చితంగా అగ్రి బీఎస్సీ చదివిన కాలేజీ కాస్తా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) నుంచి అనుమతి పొంది ఉండాలి. ఇక్కడ కర్నూలులో ఉన్న ఈ కాలేజీకి ఐసీఏఆర్‌ నుంచి ఎలాంటి అనుమతి లేదు. అంటే వ్యవసాయశాఖలో ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా లేదన్నమాట. అయినప్పటికీ ఉద్యోగాలు వస్తాయంటూ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను మోసం చేస్తోంది. పైగా ఐసీఏఆర్‌ అనుమతి పొందిన సిలబస్‌నే తాము బోధిస్తామని ప్రకటనలు ఇస్తోంది. ఇవేవీ తెలియని అమాయక విద్యార్థులు కాలేజీ యాజమాన్యం మోసపూరిత మాటలతో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇక్కడి విద్యాశాఖ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement