పెట్రో ధరల పెంపుపై రాస్తారోకో
ధర్మారం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ధర్మారం, వెల్గటూర్ మండలాల ఆటోయూనియన్ ఆధ్వర్యంలో ధర్మారంలో మంగళవారం ర్యాలీ, రాస్తారోకో చేశారు. స్థానిక మార్కెట్‌యార్డు నుంచి కొత్త బస్టాండ్, పాతబస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటోలలో ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని రాష్ట్ర రహదారిపై ఆటోలతో నిరసన తెలిపారు. ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్, టీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పుస్కూరి జితేందర్‌రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భగా డాక్టర్ నగేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారంపడేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిసార్లు పెట్రో ఉత్పత్తులపై ధరలు పెంచిందని పేర్కొన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌చేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు కాడె సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ కాంపల్లి చంద్రశేఖర్, అటోయూనియన్ అధ్యక్షులు దేవి లక్షీ్మరాజం, గుమ్ముల పోచయ్య, సాగర్, భూక్య రాజేశం, నాయకులు పాల్గొన్నారు.