సమర్థవంతంగా స్యాతంత్య్ర వేడుకలు
నెల్లూరు(పొగతోట) : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ పతాకావిష్కరణ, కవాతు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మైదానంలో వీఐపీలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబం«ధించిన నివేదికలను శాఖల వారీగా సీపీఓ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోదులు, న్యాయశాఖ అధికారులకు ఆహ్వానించాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం కస్తూర్బా కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనలో తిక్కన, పొట్టిశ్రీరాములు మహానుభావుల చరిత్రలతో కుడిన ప్రదర్శనలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అత్యావసర వైద్యశిబిరాలు అందుబాటులో ఉంచాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను అకట్టుకునే విధంగా సిద్ధం చేయాలని తెలిపారు. అధికారులు, ఉద్యోగులందరు హాజరుకాలన్నారు. వివిధ శాఖల రుణాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ లావణ్యవేణి, ఇన్‌చార్జి డీఈఓ విజయలక్ష్మి, సీపీఓ పీబీకే మూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, ఐటిడీఏ పీఓ కమలకుమారి, ఐసీడీఎస్ పీడీ విద్యావతి, నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు అధికారులు పాల్గొన్నారు.