
బుడ్డ శనగ రైతులకు శుభవార్త
జిల్లాలో 2012-13 రబీ సీజన్‌లో సాగు చేసి ప్రీమియం చెల్లించిన బుడ్డ శనగ రైతులకు వారం, పది రోజుల్లో బీమా మొత్తాన్ని జమ చేయనున్నారు.
♦ జిల్లాలో 11,262మందికి రూ55.54కోట్లు మంజూరు
♦ వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ
♦ ఫలించిన ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి,
♦ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిల కృషి
పులివెందుల/రూరల్ : జిల్లాలో 2012-13 రబీ సీజన్‌లో సాగు చేసి ప్రీమియం చెల్లించిన బుడ్డ శనగ రైతులకు వారం, పది రోజుల్లో బీమా మొత్తాన్ని జమ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 2012-13 రబీ సీజన్‌లో 55 వేలమంది రైతులు బుడ్డ శనగకు ప్రీమియం చెల్లించారు. ఇందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో 28,372 మంది రైతులకు సంబంధించి రూ.124.03 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన 26వేలమంది రైతులకు పరిహారం మంజూరు కాలేదు.
ఈ రైతుల దరఖాస్తులలో డేటా షోయింగ్, రైతులు, రెవెన్యూ అధికారుల సంతకాలు లేకపోవడం, డబుల్ ఎంట్రీ కారణాలతో ఏఐసీ(అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ) ఆఫ్ ఇండియా అధికారులు వాటిని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో పరిహారం అందని రైతులకు బీమా మంజూరుచేయాలంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు పలుమార్లు ఏఐసీ ఆఫ్ ఇండియా జీఎం రాజేశ్వరిసింగ్, వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా గతంలో ఏఐసీ ఆఫ్ ఇండియా కార్యాలయానికి రైతులతో వెళ్లి వారి పరిస్థితిని వివరించి నెల రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని ఇద్దరు ఒత్తిడి తెచ్చారు.
రెండో విడతలో 11,262 మందికి లబ్ధి
జిల్లావ్యాప్తంగా 11,262 మంది రైతులకు రూ55.54కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇందులో పులివెందుల నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి 3,623మంది రైతులు ఉన్నారు. వీరికి వారం, పదిరోజుల్లో పరిహారం వారి ఖాతాల్లో జమ కానుంది. మిగిలిన రైతులకు సైతం పరిహారం అందించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలు కృషిచేయనున్నారు. బుడ్డశనగ రైతుల బీమా మంజూరుకు కృషిచేసిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలకు వేముల జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.