వేధింపులే చంపేశాయి! | gajwel SI suicide.. agitation | Sakshi
Sakshi News home page

వేధింపులే చంపేశాయి!

Published Wed, Aug 17 2016 9:33 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

బంధువుల రోదనలు - Sakshi

బంధువుల రోదనలు

  • ఎస్‌ఐ ఆత్మహత్యతో గజ్వేల్‌లో ఉద్రిక్తత
  • బంధువుల ఆందోళన.. ప్రతిపక్షాల సంఘీభావం
  • రహదారిపై రాస్తారోకో.. స్తంభించిన రాకపోకలు
  • సీఎం కేసీఆర్‌ ఆదేశంతో గజ్వేల్‌కు చేరుకున్న మెదక్‌ ఎంపీ
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి
  • ఎస్‌ఐ ఘటనపై మెదక్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ: ఎస్పీ
  • గజ్వేల్‌/గజ్వేల్‌ రూరల్‌: గజ్వేల్‌ పట్టణం ఆందోళనలతో అట్టుడికిపోయింది. కొండపాక మండలం కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఉదంతం గజ్వేల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు టెన్షన్‌ నెలకొంది. ఎస్‌ఐ కుటుంబ సభ్యులు, బంధువులు, గజ్వేల్, కొండపాక మండలాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గజ్వేల్‌ ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రోడ్లన్నీ స్తంభించిపోయాయి.

    పోస్టుమార్టం సందర్భంగా శవాన్ని ఇక్కడి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఎస్‌ఐ బంధువులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి కారకులైన డీఎస్పీ, సీఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పట్టుబట్టారు. ఆసుపత్రి మార్చురీ సమీపంలో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

    ఆ తర్వాత కొద్దిసేపటికి ఆసుపత్రి ముందు భాగంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్దకు వచ్చి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రోడ్డుపై ధర్నాకు దిగారు. టీడీపీ నేత బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతు పలకడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. టీడీపీ నాయకులు బొల్లారం ఎల్లయ్య, కాంగ్రెస్‌ నాయకులు సర్దార్‌ ఖాన్‌, చాడ రామరాజు పంతులు, లక్ష్మారెడ్డి, భానుప్రకాష్‌ సైతం సంఘీభావం తెలిపారు. గజ్వేల్, తూప్రాన్‌ సీఐలు సతీష్, రమేష్‌బాబులు ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు.

    ఆందోళనకారులు  చాలాసేపు వారితో వాగ్వాదానికి దిగారు. స్వల్ప తోపులాటలు చోటుచేసుకున్నాయి. టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డిని అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా... ‘మీ కాళ్లు మొక్కుతం... ఎస్‌ఐ కుటుంబానికి న్యాయం జరగడానికి ఉద్యమం చేస్తున్నాం... సహకరించాలి’ అంటూ  గజ్వేల్‌ సీఐ సతీష్‌తో వేడుకున్నారు. ఆందోళన కారణంగా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ రహదారి గంటల తరబడి  రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

    పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ
    ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎస్పీ వెంకన్న సైతం ఇక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతికి దారితీసిన పరిస్థితులు, సూసైడ్‌నోట్‌ తదితర అంశాలపై విచారణ చేపట్టే బాధ్యతలు మెదక్‌ డీఎస్పీ నాగరాజుకు అప్పగించారు.

    బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎంపీ, అధికారులు
     సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ ఘటన వివరాలు తెలుసుకునేందుకు గజ్వేల్‌కు వచ్చారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు.

    ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ నగర పంచాయతీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, కొండపాక జెడ్పీటీసీ సభ్యులు చిట్టి మాధురి, ఎంపీపీ అనంతుల పద్మానరేందర్‌ తదితరులు కూడా ఇక్కడికి వచ్చి మృతుని కుటుంబీకులను ఓదార్చారు.

    దేవుడు అన్యాయం చేశాడు
    రామకృష్ణారెడ్డి ఆత్మహత్యతో అతని భార్య ధనలక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయారు. తనను పుట్టింటికి పంపించిన తర్వాత తన భర్త ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడతారని అనుకోలేదంటూ రోదించిన తీరును కలచివేసింది. భర్త మరణవార్త తెలియగానే మునుగోడు నుంచి హుటాహుటిన ఆమె తరలివచ్చారు.

    తనకు దేవుడు అన్యాయం చేశాడంటూ కన్నీరుమున్నీరయ్యారు. వీరి పెద్ద కుమారుడు శ్రీవర్ధన్‌రెడ్డి శామీర్‌పేటలోని శాంతినికేతన్‌ గురుకుల పాఠశాలలో 6వ తరగతి, రెండో కుమారుడు ఆశీష్‌రెడ్డి కొండపాకలోని శ్రీవేద ఇంటర్నేషనల్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు అంజిరెడ్డి, లక్ష్మమ్మలు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

    విచారణ చేపడతాం..
    కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం. ఈ ఘటనపై స్పందించిన సీఎం స్వయంగా నన్ను ఇక్కడికి పంపారు. వివరాలు తెలుసుకోవడానికే వచ్చాను. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ జరుపుతుంది. బాధ్యులపై కఠిన చర్యలుంటాయి. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. - కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ

    సర్కార్‌ అవినీతికి నిదర్శనం
    టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పోలీసు ఉన్నతాధికారుల వేధింపులే కారణం. బాధ్యులను సస్పెండ్‌ చేయాలి. వారిని అరెస్టు చేసి కేసు విచారణ జరపాలి. - బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు

    తొగుటలో కలకలం
    తొగుట: కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనలో తొగుట సీఐ రామాంజనేయులు పేరు రావడం మండలంలో కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎస్‌ఐ సూసైడ్‌నోట్‌ రాయడం.. అందులో పలువురు పోలీసు అధికారులతోపాటు తొగుట సీఐ రామాంజనేయులు పేరు ఉండడంతో బుధవారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణారెడ్డి గతంలో సుమారు ఏడు నెలలపాటు తొగుట ఎస్‌ఐగా  పనిచేశారు. ఇక్కడ విధులు నిర్వహించిన రోజుల్లో ఆయన ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. క్రమశిక్షణ గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement