దుర్గగుడిపై మూడు స్తంభాలాట..?
నర్సింగరావుకు మద్దతుగా ఓ వర్గం
హైదరాబాద్ ప్రయాణంపై అలజడి
విజయవాడ : సెలవుపై వెళ్లిన దుర్గగుడి ఈవో నర్సింగరావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో మూడు స్తంభాల ఆటలా మారినట్లు కనిపిస్తోంది. నర్సింగరావుకు మద్దతుగా ఓ వర్గం హైదరాబాద్ ప్రయాణమయితే అర్చకులు దీనికి వ్యతిరేకంగా ఆలయ ప్రాంగణంలో సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసుల ఆంక్షలతో కట్టుదిట్టం చేశారు. అర్చకుడు సుబ్బారావు హాస్పటల్ పాలు కావడంతో ప్రారంభమైన వివాదం రెండు రోజులపాటు అర్చకులు, ఆలయ సిబ్బంది నిరసన దీక్షలు చేసే వరకు వెళ్లింది. అయితే ఇన్‌ఛార్జి ఈవోగా ఆజాద్‌ను నియమించడంతో పాటు కొన్ని పరిణామాల మధ్య వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
కీలక మలుపు
ఓ అర్చకుడి ఇంటిలో బుధవారం సాయంత్రం దుర్గగుడి అర్చకులు కొంతమంది సమావేశం కావడంతో కీలక మలుపు చోటు చేసుకుంది. నర్సింగరావుకు మద్దతుగా హైదరాబాద్ వెళుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ అర్చకులు దుర్గగుడిపై సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ధర్మ ప్రచార సమితి రాష్ర్ట అధ్యక్షుడు జగన్మోహనరాజు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఈవో అనుమతి లే కుండా అర్చకులు, సిబ్బంది మీడియాతో మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటామనే ఆదేశాలుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.