గంగమ్మా ..
-
బంద్, అమావాస్యల ప్రభావం
-
తగ్గిన పుష్కర జనం
-
జిల్లాలో 55,016 మంది స్నానాలు
-
నేడు భక్తులు పెరిగే అవకాశం
సాక్షి, రాజమహేంద్రవరం :
గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 55,016 మంది భక్తులు స్నానమాచరించారు. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు కోటిపల్లి, అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, వాడపల్లి, జొన్నాడ, ధవళేశ్వరం రామపాదాల రేవు, మునికూడలి ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. మంగళవారం అమావాస్య కావడంతోపాటు రాష్ట్ర బంద్ వల్ల భక్తుల రాక తగ్గింది. రాజమహేంద్రవరంలోని ఘాట్లు మధ్యాహ్నం 12 గంటలకే వెలవెలబోయాయి. భక్తుల రాక మందగించడంతో మధ్యాహ్నం పుష్కర, కోటిలింగాల ఘాట్లలో జల్లు స్నానం నిలిపివేసి సాయంత్రం ప్రారంభించారు. పుష్కరఘాట్ 15,405, కోటిలింగాలఘాట్‌లో 9,370 మంది పుణ్య స్నానాలు చేశారు. పలువురు భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. భక్తుల రద్దీ తగ్గడంతో బందోబస్తు సిబ్బందిని తగ్గించారు. అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలిచ్చారు.
భక్తులకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు
రాజమహేంద్రవరం నగరంలోని ఏడు ఘాట్లలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, కాలేజీల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు భక్తులకు సేవలందించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు 100 మంది, ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు 190 మంది, ఏబీవీపీ, ఆంధ్రకేసరి యువజన సంఘం ప్రతినిధులు, ఎస్‌ఆర్‌కే మహిళా కాలేజీ ఎన్‌సీసీ క్యాడెట్లు, శ్రీ కల్కి మానవసేవా సంస్థ ప్రతినిధు లు భక్తులకు వివిధ సమాచారం, వృద్థులను ఘాట్లలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం, మంచినీరు అందించడం వంటి సేవలు అందించారు.
వైభవంగా హారతి మహోత్సవం
పుష్కరాల రేవులో రాత్రి ఏడు గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్షం పడుతున్నా సుమారు 7,500 భక్తులు హారతిని వీక్షించి ఆనందపరవశులయ్యారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీ జె.కులశేఖర్ సిబ్బందితో కలసి హారతి కార్యక్రమం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. రాజమహేద్రవరంలోని ఘాట్లలో ఎన్‌సీసీ 18వ ఆంధ్రాబెటాలియన్ కమాండెంట్ కల్నల్ మనీష్ గౌర్ పర్యటించారు. ఆయా ఘాట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లకు భోజన వసతి, రవాణా సౌకర్యం అందించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కోటిలింగాలఘాట్‌లోని తెరపై రాత్రి ఏడుగంటకు ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర భాష, సాంసృ్కతిక శాఖ ఆధ్వర్యంలో కనకదుర్గ ప్రజానాట్యమండలి ఆనం కళాకేంద్రంలో శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్శించింది.
మంగళవారం జిల్లాలోని వివిధ ఘాట్లలో స్నానమాచరించిన భక్తుల సంఖ్య
కోటిలిగాలఘాట్ 9,370
పుష్కరఘాట్ 15,405
మార్కండేయఘాట్ 168
టీటీడీఘాట్ 511
శ్రద్ధానందఘాట్ 124
పద్మావతిఘాట్ 682
సరస్వతిఘాట్ 5,367
గౌతమిఘాట్ 1,675
ధవళేశ్వరం 2,854
మునికూడలి 1,797
కోటిపల్లి 930
అప్పనపల్లి 5,628
అంతర్వేది 3,960
వాడపల్లి 2,797
జొన్నాడ 2,800