anthya pushkaralu
-
ముగిసిన అంత్య పుష్కరాలు
రెంజల్ : పవిత్ర గోదావరి నది అంత్య పుష్కరాలు ముగిశాయి. చివరి రోజైన గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీంతో కందకుర్తి త్రివేణి సంగమంలో సందడి నెలకొంది. జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కర క్షేత్రంలోని 4 ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. పుణ్య స్నానాలు చేసిన అనంతరం నదిలోని పురాతణ శివాలయంతో పాటు ఒడ్డన గల పుష్కరరాజ్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అంతిమ పుష్కరాల చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెంజల్ ఎస్సై రవికుమార్ పర్యవేక్షణ చేపట్టారు. గజ ఈతగాళ్ళను అప్రమత్తం చేశారు. సుమారు 5 వేల మంది కందకుర్తిలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు అర్చకులు తెలిపారు. -
అంత్యపుష్కరాలకు పంచమి శోభ
జిల్లాలో 1,31,543 మంది పుష్కర స్నానాలు నాగ పంచమి, గరుడ పంచమితో గోదావరి తీరంలో వెల్లివిరిసిన భక్తిభావం కిటకిటలాడిన దేవాలయాలు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఎనిమిదో రోజు నదీ తీరం వెంబడి పంచమి శోభ నెలకొంది. ఆదివారం గరుడ పంచమి, నాగపంచమి కావడంతో పుష్కరస్నానం చేసి గోదావరి మాతకు పూజలు చేయడానికి భక్తకోటి తరలివచ్చింది. గోదావరి తీరం వెంబడి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మహిళలు అరటి దొప్పలపై దీపాలు వెలిగించి గోదావరి మాతకు పూజలు చేశారు. జిల్లావ్యాప్తంగా 1,31,543 భక్తులు స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు జిల్లాలోని అప్పన్నపల్లి, అయినవిల్లి, అంతర్వేది, రాజోలు, కోటిపల్లి, ధవళేశ్వరంలోని రామపాదాలరేవు తదితర ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సుగర్ లెవెల్ తగ్గడంతో కోటిలింగాల ఘాట్‌లో పడిపోయిన విశాఖపట్నానికి చెందిన పి.జనార్థనరావు చేతికి స్వల్ప గాయమైంది. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, నోడల్ అధికారి వి.విజయరామరాజు ఘాట్ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీశేషసాయి కార్పొరేటర్లతో కలసి ఘాట్ల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. వరదల వల్ల రాజమహేంద్రవరంలోని ఘాట్లకు వస్తున్న వ్యర్థాలను తరచూ తొలగించకపోవడంతో స్నానమాచరించేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గరుడ పంచమిని పురస్కరించుకుని అప్పన్నపల్లిలో సుమారు 20 వేల మంది పుష్కర స్నానం చేశారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో 47,450 మంది పుణ్య స్నానాలు చేశారు. వీఐపీల ఘాట్‌లో ప్రముఖుల పుష్కర స్నానాలు... రాజమహేంద్రవరంలోని సరస్వతీ(వీఐపీ)ఘాట్‌లో ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కరస్నానం చేశారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ బి.శివశంకర్‌రావు తన సోదరుడితో కలసి పుణ్యస్నానం ఆచరించి తీర్థవిధులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఏవీ నిర్మలా గీతాంబ పుష్కర స్నానం చేశారు. 2012 నుంచి భారత్ పరిక్రమ పాదయాత్ర చేస్తున్న రాషీ్ట్రయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) ప్రధాన ప్రచారక్ సీతారాంజీ తన అనుచరులతో కలసి పుణ్యస్నానం ఆచరించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ పుష్కర స్నానం చేసి, గోదావరి మాత విగ్రహం వద్ద పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. భక్తుల మనసులు గెలుస్తున్న వలంటీర్లు... స్వచ్ఛంద సంస్థలు, వివిధ కాలేజీల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ క్యాడెట్లు భక్తుల అభినందనలు అందుకుంటుంన్నారు. ఆంధ్రకేసరి డిగ్రీ, జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు 100 మంది రోజూ కోటిలింగాల ఘాట్‌లో, ఆర్ట్స్ కాలేజీ, ఆదిత్య కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదికవి నన్నయ్య వర్సిటీ విద్యార్థులు, శ్రీకల్కి మానవ సేవా సమితి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. శోభాయమానంగా గోదావరి హారతి రాష్ట్ర దేవాదాయ శాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పుష్కరఘాట్‌లో నిర్వహిస్తోన్న గోదావరి హారతి కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. నాగ పంచమితో పాటు ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హారతిని దర్శించుకున్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ హారతి కార్యమ్రాన్ని వీక్షించారు. ఆనం కళాకేంద్రంలో విశాఖపట్నానికి చెందిన శ్రీసాయి కళానికేతన్ వెల్ఫేర్ బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకం ప్రేక్షకులను అలరించింది. సరస్వతిఘాట్‌లో శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళా క్షేత్రం వారి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కోటిలింగాల ఘాట్‌లో రాత్రి ఏడు గంటలకు నగరపాలక సంస్థ గులే బకావళి కథ చిత్రాన్ని ప్రదర్శించింది. -
పుష్కరోత్సాహం
-
12మంది మహనీయులకు పిండప్రదానం
రాజమహేంద్రవరం కల్చరల్ : తెలుగు జాతికి ఎనలేని సేవలందించిన 12 మంది మహనీయులకు గోదావరి అంత్యపుష్కరాల సందర్భంగా బ్రౌన్ మందిరం ఆధ్వర్యంలో గురు వారం పిండ ప్రదానం చేశారు. ఆదికవి నన్నయ, కవిసార్వభౌముడు శ్రీనాథుడు, తెలుగు భాషా సాహిత్యాల ఉద్ధారకుడు సీపీ బ్రౌన్, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్, గోదావరిపై తొలి రైలు బ్రిడ్జి నిర్మించిన హేవ్‌లాక్, యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం, సంస్కరణల కోసం కలంపట్టిన సామినేని ముద్దునరసింహం, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, జానపద వాజ్మయోద్ధారక నేదునూరి గంగాధరం, ఆంధ్రపురాణకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, పుంభావ సరస్వతి మల్లంపల్లి శరభేశ్వరశర్మ, మహామహోపాధ్యాయ మధుర కృష్ణమూర్తి శాసి్త్రలకు పుష్కరాల రేవులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, బ్రౌను మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి పిండ ప్రదానాలు చేశారు. ఈసందర్భంగా రౌతు మాట్లాడుతూ తెలుగుజాతికి చిరస్మరణీయమైన సేవలందించిన మహనీయులనుఅంత్యపుష్కరాల శుభతరుణంలో సంస్మరించుకోవడం మన కనీస కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సన్నిధానం శాసి్త్రని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు. -
భక్తి పరవళ్లు
ఐదో రోజూ 37,096 మంది పుణ్యస్నానాలు భక్తి శ్రద్ధలతో భక్తుల పూజలు పెరుగుతున్న వరద పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఐదో రోజు గురువారం భక్తుల స్నానాలతో నదీతీరం పరవశించింది. జిల్లా వ్యాప్తంగా 37,096 మంది పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. రాజమహేద్రవరం నగరంలోని ఘాట్లలో స్నానమాచరించేందుకు 22,521 మంది భక్తులు రాగా ఇందులో ఒక్క పుష్కరఘాట్‌లోనే 15,395 మంది స్నానమాచరించారు. జిల్లాలోని అంతర్వేది, అప్పన పల్లి, అయినవిల్లి, కోటిపల్లి తదితర ఘాట్లలో స్థానిక ప్రజలు స్నానాలు చేసి సమీపంలోని ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రాజమహేంద్రవరంలోని పద్మావతి, శ్రద్ధానంద, టీటీడీ ఘాట్లలో స్నానాలు చేసిన భక్తుల సంఖ్య స్వల్పంగా ఉంది. రాజమహేంద్రవరంలోని ఘాట్లకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి యాత్రికులు తరలివచ్చారు. ఘాట్లలో స్వచ్ఛంద సంస్థలు, కాలేజీ విద్యార్థుల సేవలు కొనసాగుతున్నాయి. వరద నేపథ్యంలో ఘాట్ల వద్ద పరిస్థితిని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షించారు. వరదతో అప్రమత్తం... గోదావరి ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదికి వరద వస్తోంది. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల, పుష్కర ఘాట్లలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు మునిగిపోయాయి. ఘాట్ల వద్ద భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా ముందుగా నిర్ణయించిన మేరకు నీటి స్థాయి ఉండేలా ఇరిగేషన్ అధికారులు కాటన్ బ్యారేజీ నుంచి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. మత్స్య, అగ్నిమాపక శాఖలు అప్రమత్తమయ్యాయి. నీటి పరిమాణం పెరగడంతో సరస్వతీఘాట్‌లో రక్షణగా కట్టిన తాడును అధికారులు ముందుకు జరిపారు. వరద వల్ల ఘాట్లపై నిలిచిన వ్యర్థాలను అగ్నిమాపక, నగరపాలక సంస్థ సిబ్బంది శుభ్రం చేశారు. భక్తుల ర ద్దీ సాధారణంగా ఉండడంతో గోదావరి గట్టుపై ట్రాఫిక్ ఆంక్షలు తొగించారు. హారతి సమయంలో ఆంక్షలను తిరిగి యథావిధిగా కొనసాగాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆనం కళాకేంద్రంలో గోదావరి సింగర్స్ క్లబ్ సభ్యులు ఆలపించిన గీతాలు ప్రేక్షకులను అలరించాయి. కోటిలింగాలఘాట్ వద్ద తెరపై నగరపాలక సంస్థ డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని ప్రదర్శించింది. పుష్కరఘాట్ ఎదురుగా ఉన్న మండపం వద్ద నగరపాలక సంస్థ సౌజన్యంతో టీటీడీ పరిధిలోని హిందూ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ మౌనిక బుర్రకథ బృందం నిర్వíß ంచిన ‘సీతా కల్యాణం’ బుర్రకథలో హాస్యం పేరుతో ద్వందార్థాలతో సాగడంతో విమర్శలు వినిపించాయి. ––––––––––––––––––––––––––––––––––– జిల్లాలో ఘాట్ల వారీగా స్నానమాచరించిన భక్తుల సంఖ్య ఘాట్ భక్తులు 1.కోటిలింగాలఘాట్, 4,060 2.పుష్కరఘాట్ 15,395 3.మార్కండేయఘాట్ 168 æ 4.టీటీడీఘాట్ 238 5.శ్రద్ధానంద ఘాట్ 78æ 6.పద్మావతిఘాట్ 315 7.గౌతమిఘాట్ 997 8.సరస్వతిఘాట్ 1,270 9.రామపాదలరేవు 860 10.మునికూడలి 739 11.కోటిపల్లి 1,949 12.అప్పనపల్లి 4,940 13.అంతర్వేది 1,880 14.వాడపల్లి 1,697 15.జొన్నాడ 2,700 -
నిఘా నీడలో
భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు స్నానఘాట్లలో నిరంతర పర్యవేక్షణ అంత్య పుష్కరాల విధుల్లో పోలీసు యంత్రాంగం గత ఏడాది గోదావరి పుష్కరాల అంతటి స్థాయిలో కాకపోయినా.. అంత్య పుష్కరాలకూ భారీగా భక్తులు తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా, వారికి భద్రత కల్పిస్తూ పోలీసులు నిరంతర సేవలు అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 2,800 మంది పోలీసు సిబ్బంది నిఘా నీడలో అంత్యపుష్కరాలు సాఫీగా సాగుతున్నాయి. – రాజమహేంద్రవరం క్రైం అంత్య పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ ఆర్.గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఘాట్లలో భక్తులు లేకపోయినప్పటికీ, ఒక్కొక్కసారి పోలీసులు ఘాట్లకే పరిమితమై, నిరంతర పహారా కాస్తున్నారు. అంత్య పుష్కరాల్లో భద్రత కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 2,800 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. వీరు 13 ఘాట్లతో పాటు నగరంలోకి వచ్చే రోడ్ల కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా, గోదావరి నదిలో ఆపదలో పడకుండా సూచనలు చేస్తున్నారు. ఘాట్లలో చోరీలు జరగకుండా నిత్యం నిఘా పెడుతున్నారు. ‘పశ్చిమ’ పోలీసుల అవస్థలు అంత్య పుష్కరాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 500 మంది పోలీసులు విధులు నిర్వహించేందుకు రాజమహేంద్రవరానికి వచ్చారు. వీరికి డ్యూటీలు 2 కి.మీ. దూరంలో వేయడంతో, వీరు చేసిన బస నుంచి వెళ్లాలంటే కనీనం రెండు గంటల పడుతుంది. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్న షెల్టర్‌లోనే పోలీసులు సర్దుకుపోతున్నారు. ఘాట్లలో భక్తులు అంతగా ఉండకపోయినప్పటికీ, ఎండలో పోలీసు గస్తీ మాత్రం తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు అంతగా ఉండనందునSపోలీసులను కొంత తగ్గించాలని కోరుతున్నారు. గంటల తరబడి డ్యూటీలు నిర్వహిస్తున్నా, కనీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వకుండా విధులు నిర్వహించమనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పుష్కరాల్లాగే రూ.225 టీఏ, డీఏ మంజూరు చేయాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు. అవసరం లేని పోలీసు సిబ్బందిని తిరిగి వారి ఊళ్లకు పంపించేయాలని చెబుతున్నారు. ట్రాఫిక్ సడలింపునకు విన్నపాలు అంత్య పుష్కరాల్లో రాజమహేంద్రవరంలోని ఘాట్లకు రోజు 1.5 లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఆ మేరకు గోదావరి గట్టు వెంబడి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీలేని సమయంలో కూడా ఇవి కొనసాగుతున్నాయి. తమ సౌకర్యార్థం రద్దీలేని రోజు అందుకు అనుగుణంగా ఆంక్షలు సడలించాలని భక్తులు కోరుతున్నారు. రాత్రి హారతి కార్యక్రమం వీక్షించేందుకు నగరంలోని ప్రజలు కుటుంబ సభ్యులతో రావడానికి, స్థానికంగా ఉండే ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
గంగమ్మా ..
బంద్, అమావాస్యల ప్రభావం తగ్గిన పుష్కర జనం జిల్లాలో 55,016 మంది స్నానాలు నేడు భక్తులు పెరిగే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం జిల్లా వ్యాప్తంగా 55,016 మంది భక్తులు స్నానమాచరించారు. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు కోటిపల్లి, అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, వాడపల్లి, జొన్నాడ, ధవళేశ్వరం రామపాదాల రేవు, మునికూడలి ఘాట్లలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. మంగళవారం అమావాస్య కావడంతోపాటు రాష్ట్ర బంద్ వల్ల భక్తుల రాక తగ్గింది. రాజమహేంద్రవరంలోని ఘాట్లు మధ్యాహ్నం 12 గంటలకే వెలవెలబోయాయి. భక్తుల రాక మందగించడంతో మధ్యాహ్నం పుష్కర, కోటిలింగాల ఘాట్లలో జల్లు స్నానం నిలిపివేసి సాయంత్రం ప్రారంభించారు. పుష్కరఘాట్ 15,405, కోటిలింగాలఘాట్లో 9,370 మంది పుణ్య స్నానాలు చేశారు. పలువురు భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. భక్తుల రద్దీ తగ్గడంతో బందోబస్తు సిబ్బందిని తగ్గించారు. అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఘాట్ల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి సూచనలిచ్చారు. భక్తులకు సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు రాజమహేంద్రవరం నగరంలోని ఏడు ఘాట్లలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, కాలేజీల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు భక్తులకు సేవలందించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు 100 మంది, ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు 190 మంది, ఏబీవీపీ, ఆంధ్రకేసరి యువజన సంఘం ప్రతినిధులు, ఎస్ఆర్కే మహిళా కాలేజీ ఎన్సీసీ క్యాడెట్లు, శ్రీ కల్కి మానవసేవా సంస్థ ప్రతినిధు లు భక్తులకు వివిధ సమాచారం, వృద్థులను ఘాట్లలోకి తీసుకెళ్లడం, తీసుకురావడం, మంచినీరు అందించడం వంటి సేవలు అందించారు. వైభవంగా హారతి మహోత్సవం పుష్కరాల రేవులో రాత్రి ఏడు గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. వర్షం పడుతున్నా సుమారు 7,500 భక్తులు హారతిని వీక్షించి ఆనందపరవశులయ్యారు. ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీ జె.కులశేఖర్ సిబ్బందితో కలసి హారతి కార్యక్రమం వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. రాజమహేద్రవరంలోని ఘాట్లలో ఎన్సీసీ 18వ ఆంధ్రాబెటాలియన్ కమాండెంట్ కల్నల్ మనీష్ గౌర్ పర్యటించారు. ఆయా ఘాట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాడెట్లకు భోజన వసతి, రవాణా సౌకర్యం అందించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కోటిలింగాలఘాట్లోని తెరపై రాత్రి ఏడుగంటకు ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర భాష, సాంసృ్కతిక శాఖ ఆధ్వర్యంలో కనకదుర్గ ప్రజానాట్యమండలి ఆనం కళాకేంద్రంలో శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్శించింది. మంగళవారం జిల్లాలోని వివిధ ఘాట్లలో స్నానమాచరించిన భక్తుల సంఖ్య కోటిలిగాలఘాట్ 9,370 పుష్కరఘాట్ 15,405 మార్కండేయఘాట్ 168 టీటీడీఘాట్ 511 శ్రద్ధానందఘాట్ 124 పద్మావతిఘాట్ 682 సరస్వతిఘాట్ 5,367 గౌతమిఘాట్ 1,675 ధవళేశ్వరం 2,854 మునికూడలి 1,797 కోటిపల్లి 930 అప్పనపల్లి 5,628 అంతర్వేది 3,960 వాడపల్లి 2,797 జొన్నాడ 2,800 -
అంత్యోదయం
-
ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం
ధర్మపురి (కరీంనగర్): కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి అంత్యపుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం గుంటూరు దత్త పీఠాదిపతి విశ్వయోగి విశ్వంత్ జీ స్వామి పుష్కరాలను ప్రారంభించారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అంత్యపుష్కరాలను ప్రారంభించిన చినరాజప్ప
-
గోదారి తీరంలో మళ్లీ పుష్కర సందడి
-
జిల్లాలో 100 ప్రత్యేక బస్సులు
నగరంలో రూ.10 చార్జీతో సిటీ బస్సులు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవికుమార్ రాజమహేంద్రవరం సిటీ : అంత్య పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు తరలివచ్చే భక్తులకు అవసరమైన బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 100 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇవిగాక విశాఖ నుంచి 100, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మరో 100 బస్సులు తిరగనున్నాయన్నారు. నగరంలో భక్తులు ఘాట్లకు వెళ్ళేందుకు రూ.10 టిక్కెట్ తో 50 సిటీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం కాంప్లెక్స్ ఆవరణలోని ఖాళీ స్థలంలో వసతి ఏర్పాటు చేశామన్నారు. అంత్యపుష్కరాలు పూర్తయ్యేంత వరకూ బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు 0883–2463400,7382925501,7382925505 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. -
అంత్యపుష్కరాలకు రత్నగిరిపై ఏర్పాట్లు
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ దర్శనాలు భక్తుల రాక పెరిగితే దర్శనం వేళలు పెంచే యోచన: ఈఓ అన్నవరం : ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి అంత్య పుష్కరాలకు అన్నవరం దేవస్థానంలో తగిన ఏర్పాట్లు చేశామని ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన సాక్షి తో మాట్లాడుతూ ఆది పుష్కరాలతో పోల్చితే అంత్య పుష్కరాలలో దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుందని గత అనుభవాల ద్వారా తెలిస్తోందన్నారు. అందువలన సత్యదేవుని ఆలయంలో స్వామివారి దర్శన వేళల్లో కాని, వ్రతాలు, నిత్య కల్యాణం విషయంలో కానీ పెద్దగా మార్పులు చేయడం లేదన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనాలు, వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. దర్శనాలు రాత్రి తొమ్మిది గంటల వరకూ, వ్రతాల నిర్వహణ సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటుందన్నారు. కొండమీద ఉదయం నుంచి రాత్రి వరకూ, కొండదిగువన 24 గంటలూ ప్రసాదాల విక్రయానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక వేళ భక్తుల రాక అధికంగా ఉంటే స్వామివారి వ్రతాలు, దర్శనం, ప్రసాదం విక్రయాల వేళలు పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. -
మిగిలింది 48 గంటలే!
హడావుడి లేని అంత్యపుష్కరాలు ప్రభుత్వం చిన్నచూపు గోదావరి వద్ద ఏర్పాట్లు శూన్యం ఈనెల 31న పుష్కరాలు ప్రారంభం కాళేశ్వరం : గోదావరిలో లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరించి ఏడాది పూర్తయింది. పన్నెండు రోజులపాటు నదితీరం మూడు కిలోమీటర్ల మేర భక్తులతో కిక్కిరిసిపోయింది. అప్పుడు అధికారులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేశారు. ఆదిపుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ తీసుకొని ఘనంగా నిర్వహించింది. ఈనెల 31 నుంచి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఒక్క గోదావరి నదికి మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారుల హడావుడి కనిపించడంలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. దేవగురువు బృహస్పతిలో ఒక్కో సంవత్సరం ఒక్కోరాశిలోకి ప్రవేశిస్తుంటాడు. ఆయా రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆరాశిగల నదికి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించడంతో గోదావరినదికి గత ఏడాది జూలై 14 నుంచి 25 వరకు ఆది పుష్కరాలు వచ్చాయి. 12 రోజులు పాటు భక్తజనంతో గోదావరి తీరం కిక్కిరిసింది. దేవ గురువు కన్యారాశిలో ప్రవేశించే సమయం ఆసన్నమైంది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే చివరి 12 రోజులు అంత్యపుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో ఈనెల 31 నుంచి వచ్చే నెల 11 వరకు గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహించనున్నారు. అన్ని నదులకంటే భిన్నంగా గోదావరికి ఏడాది పొడవునా పుష్కరుడు ఉంటాడు. దీంతో ఈ నదిలో ఎప్పుడు స్నానమాచరించినా పుణ్యఫలం దక్కుతుందని వేదపడింతులు పేర్కొంటున్నారు. అయితే ఆదిపుష్కరాల్లో స్నానమాచరించిన వారంతా అంత్యపుష్కరాల్లో స్నానమాచరిస్తారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లేమి చేయకపోవడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. గోదావరి, ప్రాణహిత పరవళ్లు గోదావరి, ప్రాణహిత నదులు ఎగువ కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రతి ఏడాది ఆగస్టు నెలలో నిత్యం వర్షాల కురుస్తుండం కారణంగా గోదావరి ఉరకలేయనుంది. గజ ఈతగాళ్ల అవసరమూ ఉంటుంది. సూదూరప్రాంతాల నుంచి వచ్చే వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు గోదావరిలో నీళ్ళుఅధికంగా ఉన్నాయి. కనీస వసతులు కరువు.. గతేడాది అన్నిశాఖల అధికారులు సమస్వయంతో పనిచేయడంతో పుష్కరాలు విజవంతమయ్యాయి. ఈసారి అంత్యపుష్కరాలకు ప్రభుత్వ పరంగ ఎలాంటి ఏర్పాట్లు ప్రారంభం కాలేదు. కరీంనగర్లో ఈనెల 15న జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పుష్కరాల ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. మరునాడు మంథని ఆర్డీవో బాలే శ్రీనివాస్ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. అంతే.. ఇప్పటి వరకు ఎలాంటి పనులు ప్రారంభంకాలేదు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. అంత్యపుష్కరాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. çసమాన ఫలం – ఫణీంద్రశర్మ, దేవస్థానం అర్చకుడు ఆదిపుష్కరాల్లో స్నానమాచరించినా.. అంత్యపుష్కరాల్లో ఆచరించినా సమాన పుణ్యఫలం లభిస్తుంది. సంవత్సరమంతా పుష్కరుడు గోదావరిలో ఉండడంచేత గోదావరినదికి అంత్యపుష్కరాలు ఉంటాయి. 12 రోజుల పాటు పిండప్రదానాలు, పితృతర్పణాలు, దానధర్మారలు ఆదిపుష్కరాల మాదిరిగానే చేయొచ్చు. ఏర్పాట్లు చేస్తున్నాం.. డి.హరిప్రకాశ్‌రావు, కాళేశ్వరం దేవస్థానం ఈవో అంత్యపుష్కరాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. రోజుకు 10 వేల మంది పుణ్యస్నానం ఆచరించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. ఆలయానికి చెందిన నిధులే ఖర్చుచేయాలని పై అధికారులు పేర్కొంటున్నారు. 31 వరకు అన్నిశాఖల సమస్వయంతో ఏర్పాట్లు పూర్తిచేస్తాం. భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం. -
రంగుల గోదారి
సప్తవర్ణ శోభితం రోడ్ కం రైలు వంతెన మలి సంధ్య వేళ పర్యాటకులకు కనువిందు అంత్య పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణ కొవ్వూరు : అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు గోదావరి కనువిందు చేయనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ రూ.90 లక్షలు వెచ్చించి రోడ్ కం రైలు వంతెన పై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. నదిలోని నీటిపై కాంతిపడేలా వీటిని అమర్చారు. ఈ దీపాలు రంగులు మారుతూ నదిని సప్తవర్ణ శోభితం చేస్తున్నాయి. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో గోదావరికి నిత్య నీరాజనం (హారతి) సమర్పించే సమయంలో సాయంత్రం 6.45నుంచి 7.45 గంటల వరకు ఈ లైట్లు వెలిగిస్తున్నారు. ఆ సమయంలో నది ఒడ్డు నుంచి చూసేవారికి గోదావరి అందాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్ కం రైలు వంతెనపై మీదుగా రైలులో వెళ్లే ప్రయాణికులను సైతం రంగరంగుల గోదావరి కాంతులు పులకింపజేస్తున్నాయి. అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ విద్యుత్ దీపాలను పర్యాటక శాఖ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. కొరియా పరిజ్ఞానంతో.. దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్ఈడీ లను వారధిపై అమర్చారు. ఆర్‌ఈబీ (రెడ్, గ్రీన్, బ్లూ) లైట్లు ఒకదాని తరువాత ఒకటిగా రంగులు మారుతున్నాయి. రోజుల విశిష్టతను బట్టి రంగులు మార్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్వాంత్రంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి రోజుల్లో జాతీయ పతాకం రంగుల్లోను, హోలీకి వివిధ రంగులు వచ్చేవిధంగా వీటికి సెన్సార్లు అమర్చారు. ఈ లైట్లు సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు కాంతిపుంజాల్ని విరజిమ్ముతాయి. వంతెన దిగువన ప్రతి 15 మీటర్లకు ఒకటి చొప్పున సుమారు 200 లైట్లు అమర్చారు. ఇందుకయ్యే విద్యుత్ వాడకం ఖర్చును రాజమండ్రి నగరపాలక సంస్థ భరిస్తుంది.