-
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ దర్శనాలు
-
భక్తుల రాక పెరిగితే దర్శనం వేళలు పెంచే యోచన: ఈఓ
అన్నవరం :
ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి అంత్య పుష్కరాలకు అన్నవరం దేవస్థానంలో తగిన ఏర్పాట్లు చేశామని ఈఓ కే నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన సాక్షి తో మాట్లాడుతూ ఆది పుష్కరాలతో పోల్చితే అంత్య పుష్కరాలలో దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉంటుందని గత అనుభవాల ద్వారా తెలిస్తోందన్నారు. అందువలన సత్యదేవుని ఆలయంలో స్వామివారి దర్శన వేళల్లో కాని, వ్రతాలు, నిత్య కల్యాణం విషయంలో కానీ పెద్దగా మార్పులు చేయడం లేదన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారి దర్శనాలు, వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. దర్శనాలు రాత్రి తొమ్మిది గంటల వరకూ, వ్రతాల నిర్వహణ సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటుందన్నారు. కొండమీద ఉదయం నుంచి రాత్రి వరకూ, కొండదిగువన 24 గంటలూ ప్రసాదాల విక్రయానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఒక వేళ భక్తుల రాక అధికంగా ఉంటే స్వామివారి వ్రతాలు, దర్శనం, ప్రసాదం విక్రయాల వేళలు పెంచే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.