నిఘా నీడలో
-
భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు
-
స్నానఘాట్లలో నిరంతర పర్యవేక్షణ
-
అంత్య పుష్కరాల విధుల్లో పోలీసు యంత్రాంగం
గత ఏడాది గోదావరి పుష్కరాల అంతటి స్థాయిలో కాకపోయినా.. అంత్య పుష్కరాలకూ భారీగా భక్తులు తరలివస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా, వారికి భద్రత కల్పిస్తూ పోలీసులు నిరంతర సేవలు అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 2,800 మంది పోలీసు సిబ్బంది నిఘా నీడలో అంత్యపుష్కరాలు సాఫీగా సాగుతున్నాయి.
– రాజమహేంద్రవరం క్రైం
అంత్య పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ ఆర్.గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఘాట్లలో భక్తులు లేకపోయినప్పటికీ, ఒక్కొక్కసారి పోలీసులు ఘాట్లకే పరిమితమై, నిరంతర పహారా కాస్తున్నారు. అంత్య పుష్కరాల్లో భద్రత కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 2,800 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. వీరు 13 ఘాట్లతో పాటు నగరంలోకి వచ్చే రోడ్ల కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా, గోదావరి నదిలో ఆపదలో పడకుండా సూచనలు చేస్తున్నారు. ఘాట్లలో చోరీలు జరగకుండా నిత్యం నిఘా పెడుతున్నారు.
‘పశ్చిమ’ పోలీసుల అవస్థలు
అంత్య పుష్కరాల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 500 మంది పోలీసులు విధులు నిర్వహించేందుకు రాజమహేంద్రవరానికి వచ్చారు. వీరికి డ్యూటీలు 2 కి.మీ. దూరంలో వేయడంతో, వీరు చేసిన బస నుంచి వెళ్లాలంటే కనీనం రెండు గంటల పడుతుంది. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్న షెల్టర్‌లోనే పోలీసులు సర్దుకుపోతున్నారు. ఘాట్లలో భక్తులు అంతగా ఉండకపోయినప్పటికీ, ఎండలో పోలీసు గస్తీ మాత్రం తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు అంతగా ఉండనందునSపోలీసులను కొంత తగ్గించాలని కోరుతున్నారు. గంటల తరబడి డ్యూటీలు నిర్వహిస్తున్నా, కనీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వకుండా విధులు నిర్వహించమనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పుష్కరాల్లాగే రూ.225 టీఏ, డీఏ మంజూరు చేయాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు. అవసరం లేని పోలీసు సిబ్బందిని తిరిగి వారి ఊళ్లకు పంపించేయాలని చెబుతున్నారు.
ట్రాఫిక్ సడలింపునకు విన్నపాలు
అంత్య పుష్కరాల్లో రాజమహేంద్రవరంలోని ఘాట్లకు రోజు 1.5 లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఆ మేరకు గోదావరి గట్టు వెంబడి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రద్దీలేని సమయంలో కూడా ఇవి కొనసాగుతున్నాయి. తమ సౌకర్యార్థం రద్దీలేని రోజు అందుకు అనుగుణంగా ఆంక్షలు సడలించాలని భక్తులు కోరుతున్నారు. రాత్రి హారతి కార్యక్రమం వీక్షించేందుకు నగరంలోని ప్రజలు కుటుంబ సభ్యులతో రావడానికి, స్థానికంగా ఉండే ప్రజలు తమ ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.