అంత్యపుష్కరాలకు పంచమి శోభ
-
జిల్లాలో 1,31,543 మంది పుష్కర స్నానాలు
-
నాగ పంచమి, గరుడ పంచమితో
-
గోదావరి తీరంలో వెల్లివిరిసిన భక్తిభావం
-
కిటకిటలాడిన దేవాలయాలు
సాక్షి, రాజమహేంద్రవరం :
గోదావరి అంత్యపుష్కరాల్లో భాగంగా ఎనిమిదో రోజు నదీ తీరం వెంబడి పంచమి శోభ నెలకొంది. ఆదివారం గరుడ పంచమి, నాగపంచమి కావడంతో పుష్కరస్నానం చేసి గోదావరి మాతకు పూజలు చేయడానికి భక్తకోటి తరలివచ్చింది. గోదావరి తీరం వెంబడి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. మహిళలు అరటి దొప్పలపై దీపాలు వెలిగించి గోదావరి మాతకు పూజలు చేశారు. జిల్లావ్యాప్తంగా 1,31,543 భక్తులు స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఘాట్లతోపాటు జిల్లాలోని అప్పన్నపల్లి, అయినవిల్లి, అంతర్వేది, రాజోలు, కోటిపల్లి, ధవళేశ్వరంలోని రామపాదాలరేవు తదితర ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సుగర్ లెవెల్ తగ్గడంతో కోటిలింగాల ఘాట్‌లో పడిపోయిన విశాఖపట్నానికి చెందిన పి.జనార్థనరావు చేతికి స్వల్ప గాయమైంది. అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి, నోడల్ అధికారి వి.విజయరామరాజు ఘాట్ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీశేషసాయి కార్పొరేటర్లతో కలసి ఘాట్ల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. వరదల వల్ల రాజమహేంద్రవరంలోని ఘాట్లకు వస్తున్న వ్యర్థాలను తరచూ తొలగించకపోవడంతో స్నానమాచరించేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గరుడ పంచమిని పురస్కరించుకుని అప్పన్నపల్లిలో సుమారు 20 వేల మంది పుష్కర స్నానం చేశారు. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో 47,450 మంది పుణ్య స్నానాలు చేశారు.
వీఐపీల ఘాట్‌లో ప్రముఖుల పుష్కర స్నానాలు...
రాజమహేంద్రవరంలోని సరస్వతీ(వీఐపీ)ఘాట్‌లో ఆదివారం పలువురు ప్రముఖులు పుష్కరస్నానం చేశారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ బి.శివశంకర్‌రావు తన సోదరుడితో కలసి పుణ్యస్నానం ఆచరించి తీర్థవిధులు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఏవీ నిర్మలా గీతాంబ పుష్కర స్నానం చేశారు. 2012 నుంచి భారత్ పరిక్రమ పాదయాత్ర చేస్తున్న రాషీ్ట్రయ స్వయం సేవక్(ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన ప్రచారక్ సీతారాంజీ తన అనుచరులతో కలసి పుణ్యస్నానం ఆచరించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ పుష్కర స్నానం చేసి, గోదావరి మాత విగ్రహం వద్ద పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు.
భక్తుల మనసులు గెలుస్తున్న వలంటీర్లు...
స్వచ్ఛంద సంస్థలు, వివిధ కాలేజీల ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ క్యాడెట్లు భక్తుల అభినందనలు అందుకుంటుంన్నారు. ఆంధ్రకేసరి డిగ్రీ, జూనియర్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు 100 మంది రోజూ కోటిలింగాల ఘాట్‌లో, ఆర్ట్స్ కాలేజీ, ఆదిత్య కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదికవి నన్నయ్య వర్సిటీ విద్యార్థులు, శ్రీకల్కి మానవ సేవా సమితి, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భక్తులకు సేవలు అందిస్తున్నాయి.
శోభాయమానంగా గోదావరి హారతి
రాష్ట్ర దేవాదాయ శాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా పుష్కరఘాట్‌లో నిర్వహిస్తోన్న గోదావరి హారతి కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. నాగ పంచమితో పాటు ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హారతిని దర్శించుకున్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ హారతి కార్యమ్రాన్ని వీక్షించారు. ఆనం కళాకేంద్రంలో విశాఖపట్నానికి చెందిన శ్రీసాయి కళానికేతన్ వెల్ఫేర్ బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటకం ప్రేక్షకులను అలరించింది. సరస్వతిఘాట్‌లో శ్రీరాధాకృష్ణ సంగీత నృత్య కళా క్షేత్రం వారి నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కోటిలింగాల ఘాట్‌లో రాత్రి ఏడు గంటలకు నగరపాలక సంస్థ గులే బకావళి కథ చిత్రాన్ని ప్రదర్శించింది.