అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు
-
110 కిలోల గంజాయి స్వాధీనం
చింతూరు:
ఒడిశా నుంచి ఆంధ్రా, తెలంగాణా మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఏడుగురు సభ్యులుగల అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను చింతూరు ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఎ. పల్లపురాజు శనివారం మీడియాకు తెలియజేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు శుక్రవారం ఏడుగురాళ్లపల్లి సమీపంలోని మద్దిగూడెం జంక్షన్ వద్ద చింతూరు సీఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా తారసపడిన రెండు కార్లను తనిఖీ చేయగా ఒక కారులో 110 కిలోల గంజాయి, మరో కారులో ఏడుగురు నిందితులు పట్టుబడ్డారు. నిందితులను ప్రశ్నించగా గంజాయి రవాణా వివరాలు తెలిశాయని పల్లపురాజు తెలిపారు.
పక్కా ప్లాన్‌తో స్మగ్లింగ్
కర్ణాటకకు చెందిన సంతోష్ తుకారాం రాథోడ్, దేవదాసు పవారి, విశ్వనాథ దశర థ హైదరాబాద్‌లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు ఒకసారి గంజాయి స్మగ్లింగ్ చేయడంతో మంచిలాభాలు వచ్చాయి. దాంతో హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌తో కలసి మరోమారు గంజాయి స్మగ్లింగ్ చేయాలని భావించారు. దీనికోసం హైదరాబాద్‌కు చెందిన హనుమకుమార్, భద్రాచలానికి చెందిన దాసరి సతీష్ కార్లను కిరాయికి మాట్లాడుకున్నారు. ఒడిశాకు చెందిన జగ్గారావు, భద్రయ్య, సన్యాసిరావుల వద్ద వీరు చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని సుకుమామిడి వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం ఒక వాహనంలో గంజాయి, మరో వాహనంలో నిందితులు ప్రయాణిస్తూ పోలీసులకు దొరికిపోయారు. గంజాయి విక్రయించిన జగ్గారావు పోలీసులకు చిక్కగా మరో ఇద్దరు పరారైనట్టు డీఎస్పీ తెలిపారు. వారి వద్దనుండి రూ. 40,500, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను శనివారం రిమాండ్ కోసం కోర్టుకు తరలించామన్నారు. ఇన్‌ఛార్జి డీఎస్పీ పల్లపురాజు వెంట సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై గజేంద్రకుమార్ ఉన్నారు.