- దొంగ బంగారం కరిగించి జల్సాలు
- కరిగించిన వ్యాపారిని బెదిరించి రూ.లక్షలు స్వాహా
- పోలీసు పార్టీ పేరు చెప్పి బెదిరింపులు
పట్టిచ్చిన ఐడియా
Published Fri, Dec 30 2016 10:16 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
పిఠాపురం :
ఒక యువకుడి దొంగ ఆలోచన పోలీసుల మతిపోగొట్టింది. ఐడీ పార్టీ పేరుతో వ్యాపారిని బెదిరించి రూ.2 లక్షలు స్వాహా చేయడమే కాకుండా మరిన్ని వసూళ్లకు యత్నించాడు. చెడు అలవాట్లకు బానిసైన ఆయువకుడు రూ.2 వేల నోట్లు మారుస్తూ పేకాడుతూ, జల్సాలు చేస్తూ తోటివారిలో చర్చనీయాంశమయ్యాడు. ఆ నోటా ఈ నోటా సమాచారం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురానికి చెందిన ఆయువకుడు నాలుగు నెలల క్రితం ఎక్కడ నుంచో కొంత బంగారం తెచ్చి స్థానిక గోల్డు మార్కెట్ వీధిలోని వ్యాపారి వద్ద కరిగించాడు. ఆ ముద్దను విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. సొమ్ము పూర్తి కాగానే మళ్లీ బంగారం కరిగించే వ్యాపారి వద్దకు వెళ్లి తాను తెచ్చిన బంగారం దొంగదని, ఈ విషయం పోలీసులకు తెలిసిపోయిందని, రాజమండ్రి నుంచి ఐడీ పార్టీ పోలీసులు వచ్చారని వారికి డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరం జైలుకు పోతామని బెదిరించాడు. దీంతో కంగారు పడ్డ సదరు వ్యాపారి రూ.2 లక్షలు ఆయువకుడికి ఇచ్చి పోలీసులకు సర్దిచెప్పమని కోరాడు. ఆ డబ్బును సైతం ఖర్చుచేసి మళ్లీ వ్యాపారి వద్దకు వెళ్లి గతంలోలాగే బెదిరించాడు. దీంతో ఆ వ్యాపారి ససేమిరా అనడంతో ఇద్దరి మధ్యా గలాటా జరిగింది. ఈ విషయం పోలీసుల వరకూ చేరింది. వారు వ్యాపారిని ప్రశ్నించి యువకుడి వివరాలు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. యువకుడు తీసుకువచ్చిన బంగారంపైనా, దాన్ని కరిగించిన వ్యాపారిపైనా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ ఎస్సై కోటేశ్వరరావును ప్రశ్నించగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోలీసుల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై విచారణ జరుపుతున్నామన్నారు.
Advertisement
Advertisement