ఆ గీత మా గీతే..!: ఖమ్మం జిల్లా దంపతులు | geetha is our daughter, says khammam district couple | Sakshi
Sakshi News home page

ఆ గీత మా గీతే..!: ఖమ్మం జిల్లా దంపతులు

Published Sun, Aug 9 2015 8:01 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

ఆ గీత మా గీతే..!: ఖమ్మం జిల్లా దంపతులు - Sakshi

ఆ గీత మా గీతే..!: ఖమ్మం జిల్లా దంపతులు

జూలూరుపాడు(ఖమ్మం జిల్లా): పాకిస్తాన్‌లో స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉంటున్న గీత తమ కూతురేనని ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మలు చెబుతున్నారు. గీత తమను చూస్తే గుర్తు పడుతుందని వారంటున్నారు. ఇటీవల న్యూస్ ఛానల్స్, దినపత్రికల్లోను, సోషల్ మీడియాలలో గీత విషయం విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో వాటిని చూసిన కృష్ణయ్య దంపతులు గీత తమ కూతురేనని చెబుతున్నారు. పాకిస్తాన్ దేశంలో ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో మన దేశానికి చెందిన బాలిక 13 ఏళ్లుగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 10 ఏళ్ల హిందూ మూగబాలికను పంజాబ్ రేంజర్స్ తీసుకువచ్చి తమకు అప్పగించారని ఈది స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.

ఈ విషయాన్ని న్యూస్ ఛానల్స్, దినపత్రికలు విస్తృత ప్రచారం చేశాయి. ఈ కథనాలను చూసిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ దంపతులు గీత తమ కూతురేనని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. 2006 జనవరి 27న ఏసు సువార్త సభలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు తన నలుగురు కూతుళ్లను తీసుకొని వెళ్లినట్లు జజ్జర గోపమ్మ చెబుతోంది. మరునాడు 28వ తేదీన పదేళ్ల వయస్సులో ఉన్న రాణి తప్పిపోయిందని, వెతికినా ఆచూకీ లభించలేదని, ఆనాటి నుంచి రాణి కోసం వెతకని ప్రదేశంలేదని కృష్ణయ్య, గోపమ్మలు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు నలుగురు ఆడపిల్లలని పెద్ద అమ్మాయి రాజమ్మకు మతిస్థితం లేదని, రెండవ కూతురు జ్యోతికి వివాహం కాగా, మూడవ కూతురు పద్మ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నది తెలిపారు. చిన్న కూతురు రాణి పుట్టుకతోనే మూగ అని ఏమీ చదువుకోలేదని, రాణి తప్పిపోయే నాటికి పదేళ్ల వయస్సు ఉంటుందని దంపతులు ఆవేదనతో తెలిపారు. రాణి నుదుటిపై పుట్టమచ్చ ఉందని, చేతులకు పులిపిర్లు ఉన్నాయని, మెల్లకన్ను ఉన్నదని వారు చెప్పారు.

ఇటీవల టీవీల్లోను, పేపర్లల్లో వస్తున్న కథనాలలోని ఫోటోలను చూసి నోరు, పెదవులు, కళ్ళు రాణి పోలికలను ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఎనిమిదేళ్ల నాటి పాసుపోర్టుసైజు ఫొటోను చూపించి, పేపర్లల్లో వచ్చిన ఫొటోలకు పోలిక కన్పిస్తుందని, దీంతో గీత తమ కూతురేనని గట్టిగా నమ్ముతున్నట్లు వారు తెలిపారు. తమను గీత చూస్తే తప్పక గుర్తుపడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తమను ఆమె వద్దకు చేర్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని వారు కోరుతున్నారు. తాము డీఎన్‌ఏ పరీక్షలకు సైతం సిద్ధమని అంటున్నారు. కాగా కృష్ణయ్య, గోపమ్మ దంపతులు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement