వాడివేడిగా సర్వసభ్య సమావేశం
Published Wed, Nov 30 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
మెదక్ మున్సిపాలిటీ: వార్డుల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని ఇంజనీర్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్తే నాకేం తెలియదు...మీ సమస్య ఏదైనా ఉంటే చైర్మన్‌కు చెప్పుకోవాలంటూ సమాధానం ఇస్తున్నారని, ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ సమావేశాల్లో చర్చించిన ఏ సమస్యను కూడా అధికారులు పరిష్కరించలేదని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి ధ్వజమెత్తారు. మున్సిపల్ సర్వసభ్య సమావేశమంటే...చాయ్ బిస్కెట్ల సమావేశంగా మారింది...సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేవి పరిష్కారం కావడం లేదని 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ ఎద్దేవాచేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్ అధ్యక్షతన స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్లంటే మున్సిపల్ కార్యాలయంలో కనీస విలువ లేకుండా పోతుందన్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్‌చైర్మన్ వ్యక్తిగత విషయాలను సభలో చర్చించవద్దన్నారు. నీటి సమస్య పరిష్కరించాలని కోరితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని 23వ వార్డు కౌన్సిలర్ గోదల జ్యోతి సభ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన చైర్మన్ మీ సమస్యలు ఏమున్నాయో చెప్పాలంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే కౌన్సిల్ సభ్యులు మధుసూదన్‌రావు, అనిల్‌కుమార్ కలుగజేసుకుని ఆవేశం ఎందుకు అధ్యక్షా సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. చిన్న చిన్న విషయాలకు కూడా చైర్మన్‌కే చెప్పుకోవాలంటున్నారని మరో కౌన్సిలర్ రమణా పేర్కొన్నారు. కౌన్సిలర్లు పేర్కొన విషయాలు తనకు తెలియకుండా జరుగుతున్నాయని, ఇకపై అలా చేయవద్దని అధికారులకు సూచిస్తానని చైర్మన్ తెలిపారు.
జీరో బ్యాలెన్‌స అకౌంట్ల విషయంలో కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ్యులకు కనీస మర్యాద ఇవ్వని కమిషనర్ మాకొద్దంటూ కౌన్సిలర్ అనిల్‌కుమార్ తెల్చిచెప్పారు. అలాగే జీఐఎస్ సర్వేలో చాలా తప్పులు జరిగాయని, ఇష్టారీతిగా సర్వేలు నిర్వహించారని మండిపడ్డారు.
కౌన్సిలర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కమిటీ ఏర్పాటుచేసి ప్రణాళిక బద్ధంగా ముందుకెళితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పట్టణంలో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని, వాటికి అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదని కౌన్సిలర్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఒకటి చెబితే, ఇక్కడ మరొకటి చేయడం సరికాదన్నారు.
తాము ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్లకు నోటీసులివ్వాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. జీఐఎస్ సర్వే ఆధారంగా పన్నుల శాతం పెరిగి మున్సిపల్‌కు రూ.35లక్షల ఆదాయం రానున్నట్లు చైర్మన్ తెలపగా,పెరిగిన ఆస్తి పన్నులు డిసెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
జీఐఎస్ ఆన్‌లైన్ చేపట్టి 4300 మంది నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వేలో సమస్యలపై మున్సిపల్ మేనేజర్‌ను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. అలాగే పలుచోట్ల ప్రభుత్వం సీజ్‌చేసే ఇసుకను మున్సిపల్ అభివృద్ధి పనులకు వినియోగించేలా అధికారులు తహసీల్దార్‌కు లేఖ రాయాలని చైర్మన్ ఆదేశించారు.
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో గ్రేడ్-2గా ఉన్న మెదక్ మున్సిపాలిటీని గ్రేడ్-1లోకి తీసుకొస్తామన్నారు. అనంతరం వార్డుల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను కౌన్సిల్ సభ్యులు సభదృష్టికి తీసుకురాగా స్పందించిన చైర్మన్ ట్రాన్‌సకో డీఈకి ఫోన్ సమస్యను విన్నవించారు. ఈ సమావేశంలో వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు రబీన్ దివాకర్, ఆర్కె శ్రీనివాస్, చంద్రకళ, విజయలక్ష్మి, గాయత్రి, లక్ష్మి, గాయత్రి, సులోచన, గంగాధర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు నో ఎంట్రీ
మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి పాలకవర్గం మీడియాను అనుమతించలేదు. పలువురు పాత్రికేయులు ప్రశ్నించగా మున్సిపల్ చైర్మన్ ఒకింత అసహనం వ్యక్తంచేస్తూ....చాంబర్ మాకే సరిపోవడం లేదని మీరెక్కడ కూర్చుంటారని ఎదురు ప్రశ్నించారు. అనంతరం ఏమనుకున్నారో ఏమో మళ్లీ అందరిని లోపలకు అనుమతించారు.
Advertisement
Advertisement