తెల్లబోయిన నల్లధనం
కరెన్సీ మార్చే క్రమంలో విజయవాడ ముఠా ఘరానా మోసం
పాత నోట్లకు బదులు కొత్త నకిలీ నోట్లు
నగరానికి చెందిన వ్యాపారికి రూ.15లక్షలు టోకరా
హన్మకొండ చౌరస్తా : నగరంలోకి నకిలీ కరెన్సీ వస్తోంది. విజయవాడ నుంచి నకిలీ రూ.2000 నోట్లు వస్తున్నట్టు తెలుస్తోంది. పాత నోట్ల మార్పిడికి కమీషన్‌పై కొత్త నోట్లు ఇస్తామని నమ్మబలుకుతూ స్థానికులను ముగ్గులోకి దించుతున్నారు. వీరి మాటలు నమ్మి ఇప్పటికే పలువురు ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్నారు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. కరెన్సీ మార్పిడి విషయమై నగరానికి చెందిన ఓ వ్యాపారితో విజయవాడకు చెందిన ఏజెంట్ చర్చలు జరిపాడు. పాత రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే కొత్త రూ.2000 నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో సదరు వ్యాపారి రూ.20 లక్షల రూపాయలు ఆ ఏజెంట్‌కు సమర్పించాడు. బదులుగా రూ.2000 నోట్లతో 15లక్షల రూపాయల నగదు అందింది. తన బ్లాక్‌మనీ వైట్‌గా మారిందనే సంతోషం ఆ వ్యాపారికి ఎంతో సేపు లేదు. కమీషన్ ఏజెంట్ అందించిన రూ.2000 నోట్లు పూర్తిగా నకిలీవి.
కలర్ జిరాక్స్ ద్వారా కొత్త రూ.2000 నోట్లను పోలిన నకిలీ నోట్లు అందించినట్లు గ్రహించాడు. తాను మోసానికి గురైన విషయం ఎవరికీ చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నాడు. ఈ విషయం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముఠా వలలో ఇంకా పలువురు వ్యాపారులు చిక్కుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దుతో వరంగల్ నగరంలో చాలా మంది వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో నగదు పేరుకుపోరుుంది. బ్యాంకుల నుంచి మార్చుకుందామంటే ఐటీ శాఖ ఇబ్బందులు ఉండటంతో అడ్డదారులను ఆశ్రరుుస్తున్నారు.