‘సిరి’నవ్వులు.. ఇక లేవు
-
బ్రెయిన్‌స్ట్రోక్‌తో చిన్నారి మృతి
-
రామగుండంలో విషాదం
-
వినాయక నిమజ్జనం వాయిదా
రామగుండం(కరీంనగర్ జిల్లా): ఆ చిన్నారి గారాల మాటలు.. బుడిబుడి అడుగులు వేస్తుంటే వచ్చే మువ్వల శబ్దాలకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేవారు.. ఆమెచేసే సందడితో ఆ ఇంట్లో నిత్యం పండగే... అలా హాయిగా గడిచిపోతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. రెండున్నరేళ్ల సంబరాల ‘సిరు’లు కురిపించిన ఆ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. బ్రెయిన్‌స్టోక్ రావడంతో పాప మృతిచెందింది. ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిలిచ్చింది. ఈ సంఘటన రామగుండం పట్టణంలోని పాత బజార్‌లో జరిగింది.
కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పాతబజార్‌లో ఉంటున్న కట్కూరి శ్రావణ్–సంధ్య దంపతులకు కుమారుడు, కూతురు సుశ్రుత(సిరి) సంతానం. వినాయక నవరాత్రోత్సవాల్లో రెండున్నరేళ్లు సిరి ఉత్సాహంగా పాల్గొంది. వారి ఇంటిముందే ఏర్పాటుచేసిన వినాయకుడి మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన భజన, సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసింది. రాత్రి 11గంటల వరకు సందడి చేసింది. అనంతరం ఇంటికి వెళ్లి నిద్రపోయింది. కొద్దిసేపటికి నిద్రలోనే వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులు దిష్టి తగిలిందేమోనని అనుకున్నారు. సోమవారం వేకువజామున 3 గంటలకు నిద్రలేచిన సిరి నీళ్లు కావాలని అడిగింది. నీళ్లు తాగిన వెంటనే ఫిట్స్‌తోపాటు నోటి నుంచి నురుసులు రావడంతో తల్లిదండ్రుల ఆందోళన చెందారు.
గోదావరిఖనిలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఐసీయూకు తరలించారు. కొద్ది సేపట్లోనే మూడుసార్లు హార్ట్‌స్ట్రోక్, బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. వెంటనే చిన్నారి కోమాలోకి వెళ్లింది. డాక్టర్లు పరిశీలించి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టి ఉండవచ్చని తెలిపారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున సుశ్రుత మృతిచెందింది. చిన్నారి హఠాన్మరణంతో పట్టణంలో విషాదం నెలకొంది. చిన్నారి తాత కట్కూరి ఆత్మలింగం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కావడంతో బుధవారం నిర్వహించాల్సిన నిమజ్జనం వాయిదా వేశారు.