
తల్లిదండ్రులను కలపాలనుకుంది.. కానీ..
ప్రయత్నంలో విఫలమై బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: విడిపోయిన తల్లిదండ్రులను కలపాలని శతవిధాల ప్రయత్నించిన 9వ తరగతి బాలిక.. అందులో సఫలం కాలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పార్శిగుట్ట సంజీవపురానికి చెందిన రాజు, జగదీశ్వరి భార్యాభర్తలు. రాజు పాన్‌డబ్బా నిర్వహిస్తుండగా, జగదీశ్వరి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తోంది. వీరు మనస్పర్థలతో విడిపోయి వేర్వేరు గా ఉంటున్నారు. వీరి కుమార్తె బి.హరిత(16) సంజీవపురంలో తల్లి వద్ద ఉంటూ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
విడిపోయిన తల్లిదండ్రులను కలిపేందుకు హరిత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. దీంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు లోపలికి వెళ్లగా హరిత అప్పటికే మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది.