పదేళ్ల బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య?
►కిరోసిన్‌పోసి నిప్పంటించుకుంది
►మంటలు అంటుకున్నా కేకలు వేయని వైనం
►సంఘట స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
శాటిలైట్‌సిటి (రాజమహేంద్రవరం రూరల్) :
ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అయితే మంటలు అంటుకున్నప్పటికీ ఆమె కేకలు వేయకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. శాటిలైట్‌సిటీ సీబ్లాకుకు చెందిన కళాకారులు విప్ప శ్రీనివాస్, విప్ప లోవలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె విప్ప హారిక (10). హారిక స్థానిక మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం తండ్రి శ్రీనివాస్ వేషం వేయడానికి రాజమహేంద్రవరంలో సంబరాలకు వెళ్లిపోయాడు, మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో తల్లి లోవలక్ష్మితో కలిసి హారిక అక్కమ్మతల్లి జాతరమహోత్సవాల్లో అన్నసమారాధనకు వెళ్లింది. అయితే అక్కడ హారిక భోజనం చేయకుండా అన్నంపళ్లెం ఇంటికి తీసుకువచ్చేసింది. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ పావుగంట తరువాత ఇంటిలో నుంచి పొగలు వచ్చాయి. దాంతో పక్కపోర్షన్‌లో ఉంటున్న వారు కేకలు వేయగా దగ్గరలో ఉన్న ఒక ఆమె వచ్చి తలుపు తోసి చూసింది.
కాలి పట్టాలు మెరుస్తూ కనిపించడంతో లోవలక్ష్మి ఆత్మహత్య చేసుకుందేమోనని భయపడ్డారు. కబురు పంపించగా లోవలక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు అక్కడకు చేరుకున్నారు. హారిక మరణించినట్టు గుర్తించారు. సమాచారం తెలిసిన బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కనకారావు, ఎస్సైలు నాగేశ్వరరావు, కిషోర్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హారిక కాలిపోయేటప్పుడు కేకలు కూడా వేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కపోర్షన్‌లోనే ఉంటున్నవారికి కూడా పొగలు వచ్చే వరకు తెలియకపోవడం, పదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలాన్ని తూర్పుమండల డీఎస్పీ రమేష్‌బాబు పరిశీలించారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. కేసును అనుమానాస్పదమృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ కనకారావు తెలిపారు.
ఏకష్టం వచ్చింది తల్లీ ...
ఏకష్టం వచ్చింది తల్లీ మమ్ములను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ హారిక తల్లిదండ్రులు లోవలక్ష్మి, శ్రీనివాస్, సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు. చనిపోయే ముందు అరగంట వరకు అందరితో ఆప్యాయంగా మాట్లాడి ఇలా వెళ్లిపోయావేంటమ్మా అంటూ అమ్మమ్మ, ముత్తమ్మమ్మ, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. హారిక మృతితో సీ బ్లాక్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.