కార్డియాలజీ విభాగానికి చేయూత నందిస్తాం
Published Wed, Dec 28 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM
–అమెరికా కార్డియాలజీ వైద్యులు
కర్నూలు(హాస్పిటల్):
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగానికి అవసరమైన ఆర్థిక, జ్ఞానాన్ని అందించేందుకు తమ వంతు సాయం చేస్తామని అమెరికాకు చెందిన కార్డియాలజిస్టులు డాక్టర్ శ్రీని గంగసాని(అట్లాంట), డాక్టర్ మహేష్ ములుముడి(సియాటిల్) చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కార్డియో సీఎంఈ కార్యక్రమం నిర్వహించారు. హార్ట్ ఫెయిల్యూర్ అప్‌డేట్ 2017 అనే అంశం గురించి డాక్టర్ శ్రీని గంగసాని, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో నూతన పద్ధతుల గురించి డాక్టర్ మహేష్ ములుముడి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు చదువు చెప్పిన ఈ కళాశాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. తమకున్న జ్ఞానాన్ని ఇక్కడి విద్యార్థులతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె. వీరాస్వామి మాట్లాడుతూ బయట నిర్వహించే సీఎంఈలు సైతం కళాశాలలో నిర్వహిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం డాక్టర్ శ్రీని గంగసాని కార్డియాలజీ విభాగానికి పలు స్టెంట్లను విరాళంగా అందజేశారు. అమెరికా వైద్యులకు జ్ఞాపికలు ఇచ్చి ఆసుపత్రి అధికారులు సత్కరించారు. కార్యక్రమంలో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి. చంద్రశేఖర్, కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement