Published
Thu, Oct 6 2016 10:40 PM
| Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
మత్స్య సంపదను పెంచడమే లక్ష్యం
నకిరేకల్ : మత్స్య సంపదను పెంచడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ పశు, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామ శివారులోని మూసీ జలాశయంలో 18.50 లక్షలకు 6లక్షల చేప పిల్లలను గురువారం ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి వదిలిపెట్టారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చండీయాగం ప్రతిఫలంగా ఈ ఏడాది తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లు, జలాశయాలు నిండాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో 45 నుంచి 50 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దళారీ వ్యవస్థను అరికడుతూ మత్స్య సంపదపై ఆధారపడిన గంగపుత్రులు, ముదిరాజ్‌లు, బెస్త వృత్తుల కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత సీమాంద్ర ప్రభుత్వాల హయాంలో మత్స్యశాఖకు రూ.1కోటి బడ్జెట్ ఉండగా నేడు తెలంగాణలో రూ.100కోట్లకు పెంచామన్నారు. సొసైటీ సభ్యులతో సభ్యత్వం లేని వారు కూడా ఆ జాతి కోసం జరిగే ఈ మేలులో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ వర్గానికి చెందిన వారందరికి సభ్యత్వం ఇస్తామన్నారు. పెరిగిన చేపలపై సభ్యులందరికి హక్కు ఉంటుందన్నారు. చేపల విక్రయానికి ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రధానంగా నియోజకవర్గ కేంద్రాల్లో చిన్న చిన్న చేప మార్కెట్‌లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గంగ పుత్రుల కమ్యూనిటీ హాల్ కోసం రూ.10లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. గంగ పుత్రుల కోసం జీపులు, ద్విచక్రవాహనాలు కూడా 75శాతం సబ్సిడీపై అందిస్తుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం సార థ్యంతో 15 కమ్యూనిటీ హాల్‌లు మంజూరు కావడం హర్షణీయమన్నారు. మూసీ రిజార్వాయర్‌లో కూడా కేజి కల్చర్ 10 యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మత్స్యకారులలో ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ చేప పిల్లలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మత్స్య సంపద దళారుల బారిన పడకుండా ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటూ వారి జీవితాలలో వెలుగు నింపేందుకే ఈ చేప పిల్లల పంపిణి కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ వెంకట్‌రావు, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, పశు సంవర్థక శాఖ జేడీ నర్సింహ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఓయూ జేఏసీ ప్రతినిధి దూదిమెట్ల బాలరాజు యాదవ్, నల్లగొండ ఆర్డీ ఓ వెంకటాచారి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి సుజాతయాదయ్య, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి, మూసీ మత్స్యకార సంఘం చైర్మన్ అల్వాల వెంకటస్వామి, డైరెక్టర్ సాదుల నర్సయ్య, వల్లభాపురం సర్పంచ్ జయమ్మ, ఎంపీటీసీ మాద ధనలక్ష్మి, టీఆర్‌ఎస్ నాయకులు పూజర్ల శంభయ్య, పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, మాదగోని సైదులు, వీర్లపాటి రమేష్, మంగినపల్లి రాజు, ఎల్లపురెడ్డి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.