గల్ఫ్‌ వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి | going to gulf.. follow this instructions | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Published Sat, Sep 10 2016 7:00 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

గల్ఫ్‌ వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి - Sakshi

గల్ఫ్‌ వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

తాడేపల్లిగూడెం : గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్టే. ప్రవాస భారతీయ మంత్రిత్వశాఖ ఇటీవల పార్లమెంటులో ఈ వివరాలు ప్రకటించింది. ప్రపంచంలోని 184 దేశాలలో సుమారు మూడుకోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాలలో సుమారు 60 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సుమారు 20 లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలోని 17 దేశాలకు ఉద్యోగాలకు వెళ్లాలనుకునే భారతీయ కార్మికులు ప్రొటెక్టర్‌ ఆఫ్‌ ఇమిగ్రెంట్స్‌ (పీఈఇ) (వలసదారుల సంరక్షకులు) వారి కార్యాలయం ద్వారా ఇమిగ్రేషన్‌ క్లియరెన్సు (వలసవెళ్లడానికి అనుమతి) తీసుకోవాలి. బహెరిన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమన్, యూఏఈ, ఆప్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేషియా, సూడాన్, యెమెన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కొన్ని హక్కులూ ఉంటాయి. అవేమిటో ఓ సారి తెలుసుకుందాం. 

ప్రవాస కార్మికుల హక్కులు ఇవీ.. 
– స్వదేశం నుంచి విదేశానికి పోడానికి , రావడానికి స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు.
– బానిసత్వానికి , బలవంతపు చాకిరీకి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు.
– ఆలోచన, మనస్సాక్షి, మత విషయంలో స్వేచ్ఛగా ఉండే హక్కు
– హింస, అవమానమైన అణచివేత లేదా శిక్షల నుంచి స్వేచ్ఛగా ఉండే హక్కు 
గల్ఫ్‌ వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  
–  పాస్‌పోర్టు దరఖాస్తులో ఇంటిపేరు పేరు, తండ్రిపేరు, తల్లిపేరు, జీవిత భాగస్వామి ( భర్త లేదా భార్య) పేరు స్పష్టమైన స్ఫెల్లింగ్‌తో రాయాలి. జన్మస్థలం. పుట్టినతేదీ, చిరునామా, విద్యార్హతలు, సరిగ్గా పేర్కొనాలి. సరైన సమాచారంతో తప్పులు లేకుండా పాస్‌పోర్టు పొందాలి. 
– ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, వత్తి నైపుణ్యం పెంచుకోవాలి
– విదేశాలకు వెళ్లే ముందు వైద్య,ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. విదేశాలలో మెడికల్‌ చెకప్‌లో ఫెయిలైతే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపిస్తారు.  ఏ దేశానికి ఏ పనిమీద వెళ్లాలనుకుంటున్నారో స్పష్టత కలిగి ఉండాలి. విజిటింగ్‌ వీసా, ఆజాద్‌ వీసా, ఫ్రీ వీసా. ఖఫాలత్‌ వీసా, ప్రైవేట్‌ వీసాలపై విదేశాలకు వెళ్లవద్దు. చట్టబద్దమైన కంపెనీల వీసాలపై మాత్రమే వెళ్లాలి.  ప్రవాసీ భారతీయ వ్యవహారాల శాఖ , ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌  ఇమిగ్రెంట్స్‌చే  జారీచేసిన లైసెన్సు కలిగిన రిజిస్టర్డ్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలి.  విదేశీ యాజమాన్యం నుంచి పొందిన డిమాండ్‌ లెటర్, పవర్‌ ఆఫ్‌ అటార్నీ పత్రాలు ఉన్న  ఏజంటు ద్వారా మాత్రమే వెళ్లాలి.  ఇండియన్‌ ఎంబసీచే ధ్రువీకరించబడిన ఆరబ్బీతోపాటు ఇంగ్లీషు. తెలుగు, భాషలలోని ఉద్యోగ ఒప్పంద పత్రం కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం ఒక శ్రామికునిగా హక్కులను కాపాడుతుంది. 
– ఇమిగ్రేషన్‌ యాక్టు 1983 ప్రకారం.. సబ్‌ ఏజంట్లకు అనుమతి ఉండదు. కాబట్టి విదేశాలకు వెళ్లేవారు వారితో సంప్రదించకూడదు. 
– కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు ఉండేటట్టుగా చూసుకోవాలి. చెల్లుబాటులో ఉన్న వీసా తప్పకుండా పాస్‌పోర్టుపై స్టాంపింగ్‌ అయ్యి ఉండాలి. విడిగా వీసా అయ్యినా ఉండాలి. 
– విదేశాలకు ఉద్యోగానికి వెళ్లడానికి సర్వీస్‌ చార్జీగా 45 రోజుల వేతనం( రూ.20 వేలకు మించకుండా) మాత్రమే ఏజంటుకు చెల్లించాలి. చెల్లింపులు డిమాండ్‌ డ్రాప్టు లేదా చెక్కు ద్వారా చెల్లించాలి. రశీదు తీసుకోవాలి. 
– విదేశాలకు వెళ్లేటప్పుడు మీ పాసుపోర్టు, వీసా తదితర అన్ని రకాల డాక్యుమెంట్ల జిరాక్స్‌సెట్‌ను మీ కుటుంబసభ్యులకు ఇచ్చి వెళ్లాలి. 
– ముఖ్యమైన టెలిఫోన్‌ నంబర్లను గుర్తుంచుకోవాలి. 
విదేశానికి వెళ్లాక ఏం చేయాలి 
– విదేశానికి చేరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా రెసిడెంటు పర్మిట్‌ , వర్క్సు పర్మిట్, ఐడెంటిటీ కార్డు, లేబర్‌ కార్డు, అఖామా, బాతాకా పొందాలి.
– ఉపాధి కోసం విదేశాలలో ఉన్న చట్టాలను, సంప్రదాయాలను పాటించాలి. గౌరవించాలి. 
– ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరమైన ఆడంబరాలకు , విలాసాల జోలికి వెళ్లవద్దు. విలాస వస్తువుల కోసం డబ్బును వథా చేయకూడదు. పొదుపు చేసుకోవాలి. 
– విదేశాలలో ఉద్యోగాలు శాశ్వతం కాదు. ప్రపంచంలోని పరిస్థితులు , ఉద్యోగం చేస్తున్న దేశంలో సంభవించే పరిణామాల వల్ల ఏ క్షణంలోౖ¯ð నా ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న స్పహతో అప్రమత్తంగా ఉండాలి. 
– అరబ్, గల్ఫ్‌ దేశాలలో యజమాని నుంచి పారిపోయి వేరేచోట పనిచేయడం వల్ల అక్రమ వాసులు (ఖల్లివెల్లి) గా మారి తమ హక్కులను కోల్పోతారు. 
– ఓవర్‌ టైం పనిచేయాలని ఒత్తిడి చేసే అధికారం యజమానికి లేదు. ఇష్టమైతే అదనపు పనికి, అదనపు వేతనం ఇస్తేనే ఓవర్‌టైం చేయాలి. వారానికి ఒక రోజు సెలవు పొందే హక్కు ఉంది. 
– గల్ఫ్‌ దేశాల చట్టాల ప్రకారం సమ్మె, ఆందోళనలు చేయడం నిషేధం. 
– మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షా ( ఎంజీపీఎస్‌వై) ,సాంఘిక భద్రతా పొదుపు పథకంలో చేరాలి.  మీరే చేసే పొదుపునకు ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ కూడా కొంత ప్రోత్సాహక చందా జమచేస్తుంది. 
– విదేశాల నుంచి డబ్బును పంపడానికి పొదుపుకోసం సొంత ఊరిలో ఉన్న బ్యాంకులో ఎన్‌ఆర్‌ఐ ఖాతాను తెరవాలి.  సెల్‌ఫోన్లు వాడుతున్నప్పటికీ, రెండు మూడు నెలలకు ఒకసారి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రాస్తుండాలి. పోస్టు ద్వారా వచ్చే ఈ ఉత్తరాలపై ఉన్న ముద్రలు ఆపద కాలంలో ఉపయోగపడవచ్చు.  విదేశాలలో ఇబ్బంది ఉంటే సమీపంలోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించవచ్చు. 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement