టీటీడీ గోగర్భం ఉద్యానవనంలోని ఖాళీయమర్థనునికి అభిషేకం చేస్తున్న టీటీడీ అధికారులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఆస్థానం ఘనంగా జరిగింది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారే ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆలయంలో జన్మాష్టమి వేడుకలు నిర్వహించటం సంప్రదాయం. ఇందులో భాగంగా రాత్రి 8 నుండి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఉత్సవమూర్తులైన ఉగ్రశ్రీనివాసమూర్తి, శ్రీదేవి , భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణ స్వామికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు.
ద్వాదశ తిరువారాధనం, అభిషేక నివేదన అనంతరం ఉగ్రశ్రీనివాసమూర్తి దేవేరులతో కూడి ఆనంద నిలయంలోకి వేంచేపు చేశారు. బంగారు సర్వభూపాల వాహనంలో వెన్నముద్ద ధరించిన శ్రీకష్ణస్వామిని శయనించినట్లుగా అలంకరించి దివ్యప్రబంధంతో పారాయణం నివేదించారు. సేవాకాలం ముగిసిన తర్వాత తులసితో అర్చించారు. ఇదే సందర్భంగా శ్రీ మద్భాగవతంలోని తృతీయ అధ్యాయంలోని శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని అర్చకులు పురాణ పఠనం, పూజా నివేదనలతో ఆస్థానం ఘనంగా నిర్వహించారు.
అలాగే గోకులాష్టమిని పురస్కరించుకుని ఆలయం వెలుపల ఉన్నగోగర్భం ఉద్యానవనంలోని ఖాళీయ మర్థనునికి శాస్త్రోక్తంగా అభిషేకం, పూజలు, ఉట్లోత్సవం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం వేళ ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది.