గోల్డెన్ రూట్.. దుబాయ్ టు హైదరాబాద్ | Golden route from Dubai to Hyderabad | Sakshi
Sakshi News home page

గోల్డెన్ రూట్.. దుబాయ్ టు హైదరాబాద్

Published Tue, Oct 27 2015 9:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

గోల్డెన్ రూట్.. దుబాయ్ టు హైదరాబాద్

గోల్డెన్ రూట్.. దుబాయ్ టు హైదరాబాద్

వ్యవస్థీకృతంగా బంగారం అక్రమ రవాణా
సూత్రధారులుగా రియల్టర్లు, బడా వ్యాపారులు
సహకరిస్తున్న కస్టమ్స్, విమాన, హౌస్ కీపింగ్ సిబ్బంది
ప్రత్యేక సర్జరీలతో ‘క్యారియర్లు’ సిద్ధం
గత ఏడాది శంషాబాద్‌లో చిక్కింది 150 కేజీల పైనే

 
2014 జనవరి 12న ఐదు కేజీలు... 15న ఒక కేజీ... ఫిబ్రవరి 10న అర కేజీ... 28న రెండున్నర కేజీలు... మార్చి 4న ఒకటిన్నర కేజీలు... 13న ఆరున్నర కేజీలు... 20న 1.9 కేజీలు... ఏప్రిల్ 1న ఆరున్నర కేజీలు...5న ఒకటిన్నర కిలోలు... ఆ మరుసటి రోజు 685 గ్రాములు... మే 12న రెండు కిలోలు...  9న 15.7 కేజీలు... 30న 387 గ్రాములు... జూన్ 1న ఒకటిన్నర కిలోలు... సెప్టెంబర్‌లో రెండు కేజీలు... శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ బంగారం లెక్కలివి. మొత్తమ్మీద గత ఏడాది 150 కేజీల పైనే ఈ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడింది.  
 
 సాక్షి, సిటీబ్యూరో: దుబాయ్ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారంలో అనేక మంది పాత్రధారులుగా... నగరానికి చెందిన కొందరు బడాబాబులు సూత్రధారులుగా ఉంటున్నారు. భారత మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో పాటు దిగుమతి సుంకం పైకి... రూపాయి విలువ కిందికి చేరడమే స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలా చూసినా కేజీ బంగారం అక్రమ రవాణా చేస్తే కనిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల లాభం ఉంటోందని అంచనా వేస్తున్నారు.
 
 స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్
 దుబాయ్... ఇప్పటి వరకు కేవలం హవాలా రాకెట్లకు మాత్రమే పేరుగాంచగా... ఇప్పుడు బంగారం అక్రమ రవాణాకూ కేంద్రంగా మారిపోయింది. ఆ దేశంలో ఆదాయపు పన్ను లేకపోవడంతో మనీలాండరింగ్ వ్యవహారమే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడి నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి... దాన్ని బంగారంగా మార్చి ఇక్కడికి తీసుకు వస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీ సొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. అధికారులు అభ్యంతరం చెప్పరు. దీన్ని ఆసరాగా చేసుకుని అక్కడ చాలా తేలిగ్గా విమానంలోకి బంగారాన్ని తరలించేస్తున్న స్మగ్లర్లు ఇక్కడ బయటకు తీసుకువచ్చే సమయాల్లోనే పట్టుబడుతున్నారు.
 
 క్యారియర్లను ఏర్పాటు చేసుకుని...
 ఈ పరిణామాల నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగారు. ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ యజమాని, రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడు క్యారియర్లను ఏర్పాటు చేసుకుని దందా ప్రారంభించారని ఇప్పటికే కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అబ్దుల్ ఖాదర్, సుజాత్ అలీ సహా మరికొందరు మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి చెందినయువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టిక్కెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరిని సాంకేతిక పరిభాషలో ‘క్యారియర్లు’ అంటారు.
 
 కలసి వస్తున్న విమాన సర్వీసులు
 అంతర్జాతీయ సర్వీసులను నడిపే అన్ని విమానయాన సంస్థలూ మార్గ మధ్యలో దేశవాళీ సర్వీసుగా మార్పును ప్రోత్సహించవు. కేవలం కొన్ని మాత్రమే ఈ విధానాన్ని అవలంభిస్తున్నాయి. దీని ప్రకారం దుబాయ్ తదితర దేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా ప్రారంభమైన ఓ విమానం దేశంలోకి ప్రవేశించిన తరవాత దాన్ని దేశవాళీ సర్వీసుగా వినియోగిస్తుంది. డొమెస్టిక్ ట్రావెల్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న... అప్పటికప్పుడు కొనుగోలు చేసిన ప్రయాణికులను దేశీయంగా అంతర్జాతీయ ప్రయాణికులతో కలిపి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. దీంతో పాటు ఈ ఎయిర్‌లైన్స్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సమయంలో కల్పిస్తున్న మరో సౌకర్యం కూడా స్మగ్లర్లకు కలిసి వస్తోందని కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
 
 అనేక మందితో స్మగ్లర్ల ములాఖత్...
 కస్టమ్స్ తనిఖీల్లో బంగారం చిక్కకుండా సురక్షితంగా విమానాశ్రయం బయటకు తీసుకు రావడానికి స్మగ్లర్లు అనేక మందితో ములాఖత్ అవుతున్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ వారితోనూ సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. క్యారియర్ ప్రయాణిస్తున్న విమానం వివరాలను వీరికి స్మగ్లర్లు ముందే చెప్పి డ్యూటీల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ల్యాండ్ అయిన వెంటనే క్యారియర్లు విమానం లోపల... ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న మూత్రశాలల్లోకి వెళ్లి తమ వద్ద ప్యాక్ చేసి ఉన్న బంగారాన్ని అందులో వేసేస్తారు.
 
 ఆ రోజు ప్యాక్‌ను ఎక్కడ వేయాలన్నది ఎయిర్‌లైన్స్, హౌస్‌కీపింగ్ సిబ్బంది సూచనల మేరకు వీరికి ముందే చెప్తారు. ఆపై క్యారియర్ కస్టమ్స్ క్లియరెన్స్ తరవాత బయటకు వచ్చి నిర్ణీత ప్రాంతంలో ఎదురు చూస్తారు. అంతర్జాతీయ విమానాల హడావుడి తగ్గిన తరవాత ఎయిర్‌లైన్స్, హౌస్‌కీపింగ్ సిబ్బంది డస్ట్‌బిన్స్‌లోని ప్యాకెట్లను గ్రౌండ్ ఫ్లోర్ ద్వారా తనిఖీలకు చిక్కకుండా చెత్త మాదిరిగా బయటకు తీసుకువచ్చి మళ్లీ క్యారియర్లకు అందిస్తారు. దీని నిమిత్తం వీరికి కేవలం నామమాత్రం చెల్లిస్తారు. కొందరు కస్టమ్స్ అధికారులు సైతం ఇదే తరహాలో స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.
 
 క్లెయిమ్ చెయ్యకుంటే వేలమే
 కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పద్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం... తదితరాలను పరిగణనలోకి తీసుకుని అనుమానితులను గుర్తిస్తారు. బయటి రాష్ట్రాల్లో జారీ అయిన పాస్‌పోర్డులు కలిగిన వారు ఇక్కడ ల్యాండ్ అయినా అనుమానించి తనిఖీలు చేస్తారు. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లెయిమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఇలా చేయాలంటే ‘వైట్ మనీ’ జమ చేయాల్సి ఉండటంతో అనేక మంది వదిలేస్తారు. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైలలోని కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం  ద్వారా విక్రయిస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు.
 
 మధ్య సీట్లలోనే మతలబు...
 వ్యవస్థీకృత ముఠాలు ప్రణాళిక ప్రకారం అక్రమాలు సాగిస్తున్నాయి. అక్రమ బంగారంతో దుబాయ్ నుంచి బయలుదేరే ఓ ఏజెంట్ ఈ ఇంటర్నేషనల్ కమ్ డొమెస్టిక్ విమానంలో ఢిల్లీ లేదా ముంబై వరకు వస్తాడు. బంగారం ఉన్న బ్యాగ్‌ను అతడు కూర్చున్న సీటు కిందే వదిలి అంతర్జాతీయ ప్రయాణికుడిగా ఆయా మెట్రోల్లో విమానం దిగి కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాడు. నేరుగా డిపాచర్ లాంజ్‌కు వెళ్లి అదే విమానంలో హైదరాబాద్ వెళ్లడానికి అనువుగా ముందే బుక్ చేసుకున్న టిక్కెట్ తో దేశవాళీ ప్రయాణికుడిగా అంతకు ముందు కూర్చున్న సీటులోనే కూర్చుంటాడు.
 
 అనుకున్న ప్రకారం అతడు హైదరాబాద్ చేరినా... దేశవాళీ ప్రయాణికుడు కావడంతో ఎలాంటి కస్టమ్స్ తనిఖీలు లేకుండా విమానాశ్రయం నుంచి బంగారంతో సహా బయటకు వచ్చేస్తున్నాడు. కొన్ని సంస్థల విమాన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికుడు తమకు అనువైన సీటునూ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని స్మగ్లర్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిర్ణీత సమయానికి ముందుగానే విడివిడిగా ఒకే విమానంలో టిక్కెట్లు బుక్ చేసుకుంటూ... రెండు సర్వీసుల్లోనూ ఒకే సీటును ఎంచుకుంటున్నారు. విమానంలో రెండు వైపులా మూడేసి చొప్పున సీట్లు ఉంటాయి. వీటిలో మధ్యలో ఉండే రెండు సీట్లకూ డిమాండ్ తక్కువగా ఉంటుంది. దీంతో ఆ సీట్లనే ఎంచుకుని ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నారు.  
 
 శస్త్రచికిత్సతో రెక్టమ్ కన్సీల్‌మెంట్...
 అత్యధిక శాతం స్మగ్లర్లు బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మెబైల్ చార్జర్స్‌లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తరవాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తీసుకువచ్చారు. ఆపై రెక్టమ్ కన్సీల్‌మెంట్ జోరుగా సాగుతున్నట్టు గత ఏడాది వెలుగులోకి వచ్చిన మూడు కేసులు నిర్థారిస్తున్నాయని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement