మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి జిల్లేపల్లి సైదులు
-
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు
మధిర : రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు జల్లేపల్లి సైదులు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి తూమాటి నర్సిరెడ్డి ఆరోపించారు. మంగళవారం రిక్రియేషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. రెండు నెలల క్రితం నాయకన్‌గూడెం వద్ద ఎన్‌ఎస్‌పీ కాలువపై జరిగిన బస్సు ప్రమాదంలో ఒక పాప మృతి చెందిందని, అయితే అక్కడ ఎటువంటి జాగ్రత్తలు చేపట్టకపోవడంతోనే.. తిరిగి అక్కడే జరిగిన మరో ప్రమాదంలో అమాయకులు మృతి చెందారని విమర్శించారు. బ్రిడ్జిపై రైలింగ్ లేకపోవడంతోనే బస్సు ఫల్టీ కొట్టిందన్నారు. 10మంది ప్రయాణికుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల బాధ్యత వహిస్తూ ఆర్‌అండ్‌బీ, ఎన్‌ఎస్‌పీ అధికారులను సమన్వయపర్చి సమస్యను పరిష్కరించక పోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అంతేకాక మంత్రి ఈ రహదారి నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారని, అయినప్పటికీ మంత్రి చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపించారు. మృతిచెందిన ప్రయాణికులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5లక్షలు, గాయపడినవారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడుదల చేయాలని కోరారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ఊసెత్తని ప్రభుత్వం ప్రజలకు గారడీ మాటలు చెబుతోందని విమర్శించారు. అర్హులైనవారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకలను ప్రతి పల్లెలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి త్వరలోనే కృషి చేస్తామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్ సీపీ క్రియాశీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమావేశంలో నాయకులు షేక్ ఖాసీం సాహెబ్, ముక్కెర వెంకట్రామిరెడ్డి, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, చింతిరాల వెంకటే శ్వరరావు ఉన్నారు.