వారం ముందే ఎంజాయ్..
రేపటి నుంచే స్కూళ్లకు సెలవులు
దోమ : సాధారణం కన్నా ఈ నెల ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రభుత్వం పాఠశాలలకు ముందస్తుగా సెలవులు ప్రకటించింది. శనివారం నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులను ప్రకటిస్తూ విద్యా శాఖ ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా ఏప్రిల్ 23తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. అయితే ఈ సారి నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వారం ముందుగానే సెలవులు ప్రకటించింది. జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన నూతన సంస్కరణల్లో భాగంగా ఈ ఏడాది 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు మార్చి 14వ తేదీనే ముగిశాయి.
అదే నెల 21వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని అధికారులు ముందుగా నిర్ణయించారు. అయితే పలు కారణాలతో ఆ ప్రక్రియను వాయిదా వేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోవడం, విద్యార్థులకు ఏం బోధించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో పాఠశాలల నిర్వహణలో కొంత అయోమయం నెలకొంది. పరీక్షలు ముగియడంతో పాటు ఎండలు మండుతుండడంతో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పట్టింది. ఈ విషయాలన్నింటినీ పరిగణన లోకి తీసుకున్న ప్రభుత్వ.. ముందస్తు సెలవులు ఇవ్వడానికి మొగ్గు చూపింది.