అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాజిక తనిఖీలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాజిక తనిఖీలు
Published Tue, Aug 22 2017 2:40 AM | Last Updated on Sat, Jun 2 2018 8:39 PM
ఉపాధి హామీ తరహాలో ఏర్పాట్లు
తప్పులు చేస్తే గ్రామ సభల్లో విచారణ
చాపకింద నీరులా పావులు కదుపుతున్న ప్రభుత్వం
ఆందోళనలో అంగన్‌వాడీ కార్యకర్తలు
ఏలూరు (మెట్రో):
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకుందా... అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేటీకరించి పాఠశాలల యాజమాన్యాలకు అప్పగించనుందా...? ప్రస్తుతం ప్రభుత్వం చేసే పనులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.
ఇప్పటికే నారాయణ పాఠశాలలకు అంగన్‌వాడీలను ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. మొదటి విడతగా జిల్లాలోని మున్సిపల్ ఏరియాల్లో, ఏలూరు కార్పొరేషన్ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలను అప్పగించింది. దీనిలో భాగంగా అర్బన్ ఏరియాల్లో ఉన్న నాలుగు, ఐదు కేంద్రాలను ఒకే చోట విలీనం చేసి అంగన్‌వాడీ కార్యకర్తలను, హెల్పర్లను కేవలం విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఈ కేంద్రాలపై నారాయణ కోఆర్డినేటర్లు పెత్తనం చెలాయిస్తున్నారు.
ఇక తనిఖీల వంతు :
ఇప్పటికే ఆకస్మిక తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు అంటూ అంగన్‌వాడీలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలలో నూతన విధానంలో తనిఖీలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో సామాజిక తనిఖీలు చేస్తారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి లబ్ధిదారుని వద్దకు వెళ్లి కేంద్రాల పనితీరు ఎలా ఉంది, కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరిగ్గా అందుతుందా లేదా అన్నది పరిశీలిస్తారు. ఉపాధిహామీ సామాజిక తనిఖీలు తరహాలో బృందాలను నియమిస్తారు. ఈ బృందాలకు శిక్షణ ఇచ్చి కేంద్రాల ఆడిట్ చేయిస్తారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి బృందాలు వెళ్లి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తాయి. ప్రధానంగా పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి పలు ప్రశ్నలు తయారు చేస్తారు. కేంద్రాల్లోనే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు భోజనాలు చేస్తున్నారా లేదా ఇంటికి తీసుకెళుతున్నారా అనే అంశాలను పరిశీలిస్తారు. ఈ తనిఖీలన్నీ ఒక ఎత్తయితే ఈ బృందాల పరిశీలనలో వెల్లడైన అంశాలపై గ్రామ, మండల స్థాయిలో సభలు నిర్వహించి వీటిపై విచారణ నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు ఏమైనా కాస్త తప్పు చేసినా ఈ సభల్లో వీరి పరువు తీసేందుకు ఈ బృందాలు సిద్ధపడతాయన్నమాట.
లోపాలు సరిదిద్దేందుకంటూ వాదన :
ఈ తనిఖీల ద్వారా పిల్లలు, గర్భిణుల్లో పౌష్టికాహార సమస్యలు తీరతాయనీ ప్రస్తుతం ఈ సమస్య తీరడం లేదని చెప్పుకొస్తున్నారు. ఈ తనిఖీల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పుకొస్తుంది.
ఇదీ జిల్లాలో లెక్క :
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు 3,500 ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 3500 కార్యకర్తలు, 3500 మంది సహాయకులు విధులు నిర్వహిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థలకు మొదటి దశలో ఏలూరులో 120, తాడేపల్లిగూడెంలో 60, జంగారెడ్డిగూడెంలో 29, తణుకులో 20, నరసాపురంలో 19, పాలకొల్లులో 25, కొవ్వూరు 54, భీమవరం 30, నిడదవోలులో 18 కేంద్రాలను అప్పగించనున్నారు.
నిర్వీర్యం చేసేందుకే :
అంగన్‌వాడీ ఉద్యోగం అంటేనే భయపడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంగన్‌వాడీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే స్మార్ట్‌పల్స్ సర్వే, పల్స్‌పోలియా, ఎన్నికల విధులు, ఓటర్ల జాబితా వంటి విధుల భారం మోపుతుంది. నూతనంగా నారాయణకు అప్పగించి ఆ చిన్నారులను వీధులు దాటించి నారాయణ సంస్థలకు విద్యార్థులను తరలించాలని ప్రభుత్వం ఆదేశిస్తోందని, తాజాగా తనిఖీల పేరుతో వేధింపులకు దిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు.
అంగన్‌వాడీలను తొలగించేందుకే కుట్ర
పి.భారతి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు
క్రమక్రమంగా అంగన్‌వాడీలను కుదించి తద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను తొలగించేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయి. ఇప్పటికే అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న అంగన్‌వాడీలను వివిధ తనిఖీల పేరుతో వేధించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇటువంటి తనిఖీలు చేసి అంగన్‌వాడీలను ఉద్యోగమంటేనే భయపడేటట్లు చేయనుంది.
Advertisement