
'యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు'
తూర్పుగోదావరి జిల్లాలో ఏదో జరిగిపోతోందని అంటూ.. ఇక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు మండిపడ్డారు. సీనియర్ నేతలను రిసీవ్ చేసుకోడానికి రాజమండ్రి ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చిన తమను రోడ్డుమీదే ఆపేశారని, ఈ నిర్బంధంతో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకిలా ప్రవర్తిస్తోందో కూడా అంతుబట్టడం లేదని, అందరినీ ఎయిర్ పోర్టు వద్ద రోడ్డుమీదే ఆపేశారని చెప్పారు. దాసరి నారాయణరావును కూడా హోటల్‌లోనే హౌస్ అరెస్టు చేశారని, ఇదంతా చూస్తుంటే ఇక్కడి వారిని, ఈ కమ్యూనిటీని ఇతర ప్రాంతాల వారికి దోషుల్లా చూపించే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. దారి పొడవునా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు, వేలాదిగా పోలీసులను మోహరించారని అన్నారు. తాము నక్సలైట్లు నాయకులను కిడ్నాప్ చేయడం నుంచి కాల్దరి కాల్పుల దాకా చాలా పెద్ద ఘటనలు చూశామని, చివరకు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఇంత తీవ్ర పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ముద్రగడను పరామర్శించడానికి వచ్చిన నాయకులను కూడా నిర్బంధించారని.. కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ నాయకులను కూడా రోడ్డు మీదే నిలబెట్టేస్తున్నారని చెప్పారు. బాహ్యప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
నిర్బంధంతో శాంతి భద్రతలను కాపాడగలమని ప్రభుత్వం అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉంటుందని అనుకోవడం లేదని, సాధారణంగా నిర్బంధం వల్ల ప్రజల్లో ఎప్పుడూ వ్యతిరేకత పెరుగుతుందని తెలిపారు. శాంతియుత ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లాను కల్లోలిత ప్రాంతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కమ్యూనిటీని బోనులో నిలబెట్టాలని చూస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. పద్మనాభం నవంబర్‌లోనే కాపు ఐక్యగర్జన తేదీని ప్రకటించారని.. ఆ సభకు ఎంతమంది వస్తారో అంచనా వేయలేని ప్రభుత్వం.. ప్రజలు ఇప్పుడు ఆగ్రహానికి గురై రోడ్ల మీదకు వస్తే ఆపగలుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికి మాత్రం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని, మధ్యాహ్న భోజనాల సమయంలో కంచాల మీద గరిటెలతో కొడుతున్నారని, వాళ్లు ఆగ్రహానికి గురైతే ఈ సర్కారు ఏం చేయగలదని నిలదీశారు.