ప్రభుత్వ విద్యకు కార్పొరేట్ దెబ్బ
ప్రభుత్వ విద్యకు కార్పొరేట్ దెబ్బ
Published Sun, Sep 11 2016 10:13 PM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
దర్శి :
కార్పొరేట్ యాజమాన్యాలు రాజ్యాలు ఏలితే ప్రభుత్వ విద్య పతనమవుతుందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక తాలూకా క్లబ్ సమావేశపు హాలులో యూటీఎఫ్ ప్రాంతీయ విద్యా సదస్సు ఆ శాఖ కార్యదర్శి జి.రాజశేఖర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడాదిలో విద్యారంగానికి రూ.21 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, బడ్జెట్‌లో 25 శాతం నిధులు విద్యకే కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఇంత చేస్తున్నా విద్యారంగంలో ఏపీ 25వ స్థానానికి ఎందుకు పడిపోయిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బడికి Ðð ళ్లరు.. పాఠాలు చెప్పరంటూ అపవాదులు మోపుతారేతప్ప పాఠశాలల్లో వసతులు, అవసరాలపై మాత్రం ఆలోచన చేయడం లేదన్నారు. ఉపాధ్యాయుల పని తీరు ఆధారంగా పీఆర్సీలు ఇస్తామన్న ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కలెక్టర్లకు కూడా పనితీరు ఆధారంగానే వేతనాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.
దేశంలో 25 శాతం కార్పొరేట్ పాఠశాలలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 45 శాతం కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. వాటి యాజమాన్యాలే రాష్ట్రాన్ని పాలించే మంత్రులు కావడం బాధాకరమన్నారు. పదేళ్ల తర్వాత సగం మంది ఉపాధ్యాయులు కూడా ఉద్యోగాల్లో ఉంటారన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే 10 వేల పోస్టులు భర్తీ చేయకుండా పక్కన పెట్టారని, సీపీఎస్ విధానంలో పెన్షన్‌లు ఇవ్వాలని కోరుతున్నా ఆ పెన్షన్‌లు వచ్చే వరకూ ఉద్యోగాలుంటాయన్న నమ్మకం లేదన్నారు. పంచాయతీకి రూ.రెండు కోట్ల నిధులతో ఇంగ్లిష్ మీడియం స్కూలు ఏర్పాటు చేయాలని,పాఠశాలల్లో ఆధునిక అవసరాలు కల్పించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు అండగా ఉంటా : బూచేపల్లి
ఉపాధ్యాయులకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. సుబ్రహ్మణ్యం వంటి ఉన్నత వ్యక్తి ఎమ్మెల్సీ కావడం అభినందనీయమన్నారు. దర్శి మోడల్ స్కూల్‌లో హాస్టల్‌ను తన హయాంలో నిర్మించామని, రెండేళ్లు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మీరైనా ప్రారంభానికి కృషి చేయాలని సుబ్రహ్మణ్యానికి సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం తమ ట్రస్టు ద్వారా ఉపాధ్యాయులకు బ్యాగ్‌లు పంపిణీ చేశారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డిని ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంఎస్‌సీ వై శ్రీనివాసరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు వి.రామిరెడ్డి, జేవీవీఎం సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు మీగడ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సహాధ్యక్షుడు ఓవీ వీరారెడ్డి, ఎంపీపీ పూసల సంజీవయ్య, సర్పంచి జీసీ గురవయ్య, వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి, రాజసులోచన, రమణారెడ్డి, రవి, రాజేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రంగారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement