మద్యం వ్యాపారులకు సర్కారు బాసట
మద్యం వ్యాపారులకు సర్కారు బాసట
Published Wed, Jul 5 2017 9:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
- రాష్ట్ర రోడ్లను జిల్లా రోడ్లుగా డీనోటిఫై
- సవరణపై జీఓ ఎంఎస్ నెం.28 విడుదల
- జిల్లాలో 150 మంది వ్యాపారులకు ఊరట
- లైసెన్సుల జారీలో కదలిక
కర్నూలు(రాజ్‌విహార్) : సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం జాతీయ/రాష్ట్ర రహదారులపై మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. సదరు రహదారులను జిల్లా రహదారులుగా మార్పు చేస్తూ మంగళవారం రాత్రి జీఓ ఎంఎస్ నెం.28 విడుదల చేసింది. దీంతో జిల్లాలో రహదారుల పక్కన ఉన్న 150 మంది మద్యం వ్యాపారులకు ఊరట లభించింది. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లోనే అమ్మకాలను కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అటు వ్యాపారులు.. ఇటు ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో రోడ్ల పక్కన ఉన్న మద్యం షాపులను యజమానులు నివాస ప్రాంతాలకు తరలించడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళలు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 204 దుకాణాలు, 47 బార్లకు ప్రభుత్వం అనుమతించింది. కొత్త మద్యం పాలసీ ప్రారంభమై నాలుగు రోజులు గడిచినప్పటికీ కేవలం 74 దుకాణాలకు, రెండు బార్లకు మాత్రమే ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. నిబంధనలు తప్పించుకునేందుకు వ్యాపారులు రాజకీయ ప్రయత్నాలు కూడా చేశారు. జాతీయ/రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనతో లైసెన్సుల జారీలో గందరగోళం నెలకొని జాప్యం చోటు చేసుకుంది. సవరణ ఉత్తర్వులు వెలువడటంతో లైసెన్సుల జారీలో మళ్లీ కదలిక మొదలైంది. ఎక్సైజ్ కార్యాలయంలో వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి వరకు లైసెన్సులు జారీ ప్రక్రియ కొనసాగింది.
మూడో రోజు రూ.3.50 కోట్ల మద్యం కొనుగోలు
నూతన మద్యం పాలసీ అమలులో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు మంగళవారం మూడో రోజు రూ.3.50 కోట్ల మద్యం కొనుగోలు చేశారు. 7,600 బాక్సుల లిక్కర్, 3,300 బాక్సుల బీరును కొనుగోలు చేసి దుకాణాలకు తరలించారు. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.8 కోట్ల మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. కల్లూరు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న ఐఎంఎల్ డిపో మద్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది.
Advertisement
Advertisement