కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం
-
పశువులపై ఉన్న ప్రేమ మనుషులపై లేదు
-
ముద్రగడ స్వగృహంలో తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు
కిర్లంపూడి :
పేదరిక నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, పశువులపై ఉన్న ప్రేమ మనుషులపై లేదని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం కిర్లంపూడిలో కాపు ఉధ్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రెండు సంవత్సరాల కాలపరిమితి తరువాత చంద్రబాబు ఇచ్చిన హామీల కోసం కాపు ఉధ్యమనేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపే హక్కు ముద్రగడకు ఉందని, అటువంటి హక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రభుత్వ బలంతో అణచి వేయడానికి కుట్ర పన్నారన్నారు. దీక్షా సమయంలో చూడటానికి ఎవరూ వచ్చిన అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఆ సమయంలో రాజమహేంద్రవరం వచ్చినా ముద్రగడను చూడటానికి అనుమతినివ్వకపోవడంతో ఈ రోజు పరామర్శించడానికి వచ్చానన్నారు.S అమలాపురంలోని సుధాపాలెం ఘటన ఎంతో కలచివేసిందన్నారు. సుధాపాలెం ఘటన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి పేదరిక నిర్మూలనకు పొలాలు పంపిణీ, నిరుద్యోగులకు రాబడి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట అడపా శ్రీహరి, పోలు కిరణ్‌రెడ్డి, గుర్రం గౌతమ్ తదితరులు ఉన్నారు.