గ్రీన్‌జోన్ పేరుతో మాయాజాలం
చంద్రబాబు, బినామీలు ఆడిన (భూ) మాయా నాటకంలో జోన్‌ల వర్గీకరణ మరో కీలక అంకం. రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఏ జోన్ ఉండాలో.. ఏ జోన్‌లో ఏం ఉండాలో ముందే నిర్ణయించారు.. . అగ్రికల్చర్ (గ్రీన్) జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ జోన్ ఇలా.. ఏడు జోన్లుగా వర్గీకరించారు. ఈ జోన్‌ల వర్గీకరణలోనే భారీ కుంభకోణం దాగి ఉంది. పెదబాబు, చినబాబు, వారి బినామీలు, తెలుగుదేశంలో కీలక నాయకులు భూములు కొనుగోలు చేసిన ప్రాంతాలలోనే భూముల విలువ పెరిగేందుకు గాను కమర్షియల్, ఇండస్ట్రీస్ జోన్లు వచ్చేలా చూశారు. ఏ జోన్ ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి ఆ ప్రాంతాలలోనే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. వారికి భూములు లేని ప్రాంతాలన్నీ కలిపి అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించారు. అగ్రికల్చర్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో అనేక షరతులు విధించారు. కొనుగోలు అమ్మకాలపైనా నిషేధాజ్ఞలున్నాయి. పంటలు పండినా పండకపోయినా ఆ భూముల్లో వ్యవసాయం మాత్రమే చేయాలి. దాంతో భూముల విలువ దారుణంగా పడిపోయింది. రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న ఈ దుర్మార్గాలపై రైతులంతా తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇదీ గ్రీన్‌జోన్ ..
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 58 మండలాల్లో 8,603.32 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్‌డీఏ విస్తరించింది. ఇందులో 5,940.26(63.23 శాతం) చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని ముసాయిదా ప్రణాళికలో వ్యవసాయ పరిరక్షణ మండలాలుగా పేర్కొం ది. ఇది 15 లక్షల ఎకరాలకు సమానం. ఈ మం డలాలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తరించాయి.
వ్యూహాత్మకంగా భూములు కొన్న నేతలు..
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోని అనేక ప్రాంతాలతో పాటు వ్యవసాయ పరిరక్షణ జోన్-2, 3లోని మండలాల పరిధిలోనూ టీడీపీ ముఖ్య నేతలు, వారి అస్మదీయులు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఇవి దాదాపు 10,000 ఎకరాలు ఉండవచ్చని అంచనా. కారణం ఆ ప్రాంతంలో రాజధాని రాబోతోందని వారికి ముందుగానే ఉప్పందింది. అంతేకాదు ఏ ప్రాంతంలో ఏ జోన్ రాబోతుందన్న విషయమూ వారికి ప్రభుత్వ బహిరంగ ప్రకటనకన్నా ముందే తెలుసు. వారికి అనుకూలంగానే రాజధాని పర్‌స్పెక్టివ్ ప్లాన్ రూపుదిద్దుకుంది. ఆ జోన్లలో ఏయే అభివృద్ధి ప్రాజెక్టులు రావాలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే ప్రణాళికాకర్తలు సిద్ధం చేశారు. జోన్- 2, 3లో భవిష్యత్తులో పట్టణ అభివృద్ధి ప్రాంతం (ఫ్యూచర్ అర్బనైజ్డ్ డెవలపబుల్ ఏరియా)గా నిర్ధేశించారు. రాజధాని నగర పరిధి (క్యాపిటల్ సిటి) అభివృద్ధి తరువాత పై ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక. తద్వారా టీడీపీ అనుయాయులకు అయాచిత లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అంటే.. టీడీపీ నేతలు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో భవనాలను నిర్మించవచ్చు. ఇది టీడీపీ నేతలకు రియల్ ఎస్టేట్ బూమ్‌ను అందివ్వడమేనని చెబుతున్నారు.
జోన్-1లో కేవలం వ్యవసాయమే..
వ్యవసాయ పరిరక్షణ జోన్-1లో వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమలకు మాత్రమే అనుమతిస్తారు. ఈ మేరకు పర్‌స్పెక్టివ్ ప్లాన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. జోన్- 1 ప్రాంతం సారవంతమైన భూములు కనుకే వ్యవసాయ పరిరక్షణ జోన్‌లో చేర్చినట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ గతంలో ప్రకటించారు. అయితే వాటికన్నా అన్నివిధాలుగా మెరుగైన భూమి జోన్-2, జోన్-3లో ఉండటం పరిశీలనాంశం. ఏపీసీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్- 38 ప్రకారం పర్‌స్పెక్టివ్ ప్లాన్‌ను ప్రతి పది సంవత్సరాలకు, మాస్టర్‌ప్లాన్‌ను ప్రతి అయిదు సంవత్సరాలకు మాత్రమే మార్పులు జరిగేందుకు వీలుండేలా నిబంధన పెట్టడం కూడా టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోన్- 2, జోన్-3లో అధిక భాగం గుంటూరు జిల్లా పరిధిలో ఉంది. జోన్-1ను ఎక్కువగా కృష్ణా జిల్లాలో చూపడం ఆ జిల్లా వాసులకు ఆవేదన మిగుల్చుతోంది.
అక్కడ వృద్ధి నామమాత్రమే...
వ్యవసాయ పరిరక్షణ జోన్-1లో కేవలం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు మాత్రమే ఉండాలని పర్‌స్పెక్టివ్ ప్లాన్‌లో పేర్కొన్నారు. ఆర్థిక, వ్యాపార, సేవా రంగాలకు సంబంధించిన అంశాలు ఈ ప్రాంతంలో రావు. ఇందువల్ల ఈ ప్రాంతం ఆర్థికాభివృద్ధికి అవకాశాలు నామమాత్రం కానున్నాయి. క్యాపిటల్ సిటీలో రైతులకు కేటాయించనున్న ప్లాట్లకు డిమాండ్ పెరగాలనే ఉద్ధేశంతో రీజియన్ పరిధిలోని మిగతా మండలాలను వ్యవసాయ పరిరక్షణ జోన్‌లలో చేర్చడం వల్ల ఆయా ప్రాంతాల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. క్యాపిటల్ సిటీ పరిధిలోని భూములు కొనుగోలు చేసిన వారికి, కొందరు రైతుల కోసం తాము బలికావలసి వస్తోందని వ్యవసాయ పరిరక్షణ పరిధిలోకి చేరిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోయిన ధరలు.. నిలిచిన క్రయవిక్రయాలు..
అగ్రికల్చర్‌జోన్‌గా ప్రకటించక ముందు జోన్ - 1 ప్రాంత గ్రామాలలో ఎకరా భూమి మూడు కోట్లు పలికింది. రాజధాని ప్రాంతంలో కూడా ఇదే ధర పలికింది. నావల్లనే ఈ భూముల ధరలు ఈ స్థాయిలో పెరిగాయని సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు గ్రీన్‌జోన్ ప్రాంతాలలో భూముల విలువ పూర్తిస్థాయిలో పడిపోయింది. ఎకరా రూ. 50 లక్షలకు మించి కొనేవారు కనిపించడం లేదు. గ్రామాలకు దూరంగా ఉంటే ఎకరా 20 నుంచి 30 లక్షల లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. చాలా మంది అసలు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. పచ్చని పంట పొలాలు లాక్కొని విదేశీయులతో ప్రభుత్వ పెద్దలు ‘రియల్’ వ్యాపారాలు చేస్తున్నారు. సింగపూర్, జపాన్ కంపెనీలకు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో రైతుల భూములను మాత్రం గ్రీన్‌జోన్ పేరుతో క్రయ విక్రయాలు స్తంభించిపోయేలా చేశారు. భూముల ధరలు పూర్తిస్థాయిలో పడిపోయిన తరువాత వేల ఎకరాలు టీడీపీ నేతలు కొనుగోలు చేసి పరిశ్రమల పేరుతో విదేశీయులకు అమ్ముకునే వ్యూహాన్ని రూపొందించారు. కంకిపాడు, ఉయ్యూరు, పెగంచిప్రోలు, జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు తదితర మండలాల్లోని గ్రామాల్లో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు వేల ఎకరాల్లో బినామీ భూములు ఉన్నాయి.
ఆందోళనబాటలో రైతులు....
గ్రీన్ జోన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు చూసి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మూడుపంటలు పండే భూములను బలవంతంగా లాక్కుని కమర్షియల్ జోన్‌గా ప్రకటించడం, వర్షం పడితే తప్ప పండే పరిస్థితి లేని మెట్టభూములను గ్రీన్‌జోన్‌గా ప్రకటించడం వెనక దారుణమైన కుట్ర దాగి ఉందని రైతులు అంటున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. కంకిపాడు, ఉయ్యూరు, నందిగామ, జగ్గయ్యపేట, జి కొండూరు, కంచికచర్ల మండలాల పరిధిలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. పలువురు రైతులు సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. జోన్ ప్రకటన వల్ల కలగనున్న నష్టాలను వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘాల నాయకులు రైతులకు వివరిస్తూ సీఆర్‌డీఏ అధికారులకు అభ్యంతరాల లేఖలు పంపాలని సూచిస్తున్నారు. ఒక నెల రోజుల వ్యవధిలోనే రెండు వేల అభ్యంతరాలు వచ్చాయంటే వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతుంది. రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి పంపుతున్నాయి. దీనిపై పునరాలోచన చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయ పరిరక్షణ మండలం-1
కృష్ణా జిల్లాలోని మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు, కంకిపాడు, పెదపా రుపూడి, గుడివాడ రూరల్, నందివాడ, వీరులపాడు, వత్సవాయి, పెనుగంచిప్రోలు, మైలవరం, జి.కొండూరు, నూజివీడు పూర్తిగా, పామర్రు, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, నూజివీడు, ఇబ్రహీం పట్నం పాక్షికంగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు, చేబ్రోలు, చుండూరు, అమృతలూరు, కొల్లూరు, తెనాలి రూరల్, కొల్లిపర, వేమూరు, చేబ్రోలు, భట్టిప్రోలు పూర్తిగా, పొన్నూరు, పెదకాకాని, దుగ్గిరాల మండలాలు ఈ జోన్ కిందకు తెచ్చారు.
వ్యవసాయ పరిరక్షణ మండలం-2
కృష్ణా జిల్లాలోని చందర్లపాడు పూర్తిగా, కంచికచర్ల, జగ్గయ్యపేట మండలాలను పాక్షికంగా తెచ్చారు. ఇక గుంటూరు జిల్లాలోని యడ్లపాడు, ఫిరంగిపురం, క్రోసూరు, అచ్చంపేట మండలాలు పూర్తిగానూ, మేడికొండూరు, పెదకూరపాడు పాక్షికంగానూ ఈ జోన్ కిందకు తెచ్చారు.
వ్యవసాయ పరిరక్షణ మండలం-3
కృష్ణా జిల్లాలో కంచికచర్ల మండలం పాక్షికంగానూ, గుంటూరు జిల్లాలో తాడికొండ, మేడికొండూరు మండలాలు పూర్తిగానూ, పెదకూరపాడు, అమరావతి మండలాలు పాక్షికంగానూ ఈ జోన్ కిందకు తెచ్చారు. ఈ ప్రాంతమంతా రాజధాని నగరానికి దక్షిణం, పశ్చిమ దిక్కున ఉన్నాయి.
భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన ‘గ్రీన్‌జోన్’
విజయవాడ ఆటోనగర్‌లో ఓ ఫౌండ్రీలో పనిచేస్తున్నాను. అద్దె ఇంట్లో ఉంటున్నాం. ముత్యాలంపాడు గ్రామంలో 2006లో 80 సెంట్లు పొలం కొన్నాం. పిల్లల చదువుతో పాటు సొంత ఇల్లు, ఫౌండ్రీ షెడ్డు కోసం పొలం అమ్మాను. ఎకరం రూ.80 లక్షలకు కోనుగోలు చేసిన వారు రూ 15 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నారు. వచ్చిన డబ్బులతో నిడమానురులో కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు గ్రీన్ జోన్ రావటంతో పొలాల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అగ్రిమెంట్ రాయించుకున్న వారు ఇపుడు ఎకరం రూ. 40 లక్షలకు మించి ఇవ్వమంటున్నారు. లేకపోతే అడ్వాన్సు వెనక్కు ఇవ్వాలంటూ మెలిక పెడుతున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా అని అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాం. ఏం చేయాలో అర్థం కావటం లేదు. భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
ఎస్. రాంబాబు, ఫౌండ్రీ కార్మికుడు, విజయవాడ
రైతు పరిస్థితి అగమ్యగోచరం..
గతంలో రూ 2. కోట్లు ఉన్న భూమి ప్రస్తుతం రూ కోటికి చేరింది. మాకు భూమి ఒక్కటే ఆధారం. అమ్ముకునేందుకు, వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు అవకాశం లేకపోతే భూమి ఉండి కూడా ఏం ఉపయోగం? విజయవాడకు దగ్గరలోనే ఉన్నాం. కానీ గ్రీన్‌జోన్ పేరుతో షరతులు పెట్టడం సరైంది కాదు. నిబంధనలు సడలించకపోతే రైతు పరిస్థితి అగమ్యగోచరమే.
బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు, చలివేంద్రపాలెం
అమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నా
మాకు ఆత్మహత్యే శరణ్యం. గుర్రాజుపాలెం గ్రామానికి గత రెండు పర్యాయాలుగా సర్పంచ్‌గా కొనసాగుతున్నాను. ఉన్న ఎకరం పొలంలోనే మిరప, పత్తి పండిస్తుంటాను. గ్రీన్ జోన్ రాకముందు పొలాల ధరలు బాగా ఉండటంతో పొలం అమ్మి అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నా. ఎకరం రూ. 60 లక్షల వరకు అడిగారు. రూ 75 లక్షలు అయితే ఇస్తానని బేరం పెట్టా. జి.కొండూరు మండలం గ్రీన్ జోన్‌లోకి చేర్చడంతో రేట్లు దారుణంగా పడిపోయాయి. రెండు రోజుల క్రితం ఎకరా రూ. 18 లక్షలకు అడిగారు.
తమటం వెంకట్రామయ్య, సర్పంచ్ గుర్రాజుపాలెం (కృష్ణాజిల్లా)
ఇబ్బంది పెట్టేందుకే..
2050 సంవత్సరం దాకా గ్రీన్ బెల్ట్‌లో ఉన్న భూములలో పంటలు మాత్రమే పండించాలం టున్నారు. రైతు వారీగా కోట్ల రూపాయలు పెట్టి కొనే వాళ్లు ముందుకు రావడం లేదు. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం అమ్ముకోవాలంటే రేట్లు పూర్తిగా దిగజారిపోయాయి. ఏడాదిలోనే పొలాల రేట్లు సగానికి సగం పడిపోయాయి. ఎక్కువ రేటుకు కొనేవారు రావడం లేదు. పడిపోయిన రేటుకు అమ్ముకోలేకపోతున్నాం. -మందాళ వీరారెడ్డి, రైతు, నంబూరు