విభజించు.. పాలించు !
Published Fri, Jul 15 2016 12:45 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM
డీఆర్‌డీఏ వెలుగులో ఓ అధికారి తీరిది
రెండు వర్గాలుగా ఉద్యోగులు
గాడితప్పుతున్న పాలన
అనంతపురం టౌన్ : ఏ శాఖలో అయినా అధికారంటే కింది స్థాయి ఉద్యోగులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సరిచేసుకోవాలని సుతిమెత్తగా చెప్పడం.. ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్‌కు తోడ్పడం పరిపాటే. కానీ అనంతపురం జిల్లా గ్రామీణాభివృద్ధి వెలుగులో ఉన్న ఓ అధికారి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తుండటంతో ఉద్యోగులు రెండు వర్గాలయ్యారు.
ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో కొందరు అమాయకులు బలవుతుండగా..మరికొందరు మాత్రం మానసిక వ్యథను అనుభవిస్తున్నారు. పైకి చెప్పుకోవడానికి కూడా జంకుతున్న పరిస్థితి. కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు నిత్యం తమ పబ్బం గడుపుకోవడం కోసం లేనిపోని సమస్యలను సృష్టిస్తుంటార న్న ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి వారి వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టి తన పరిధిలోని పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన అధికారి మొక్కుబడిగా కార్యాలయానికి వస్తుండటం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది.
ఇదే అదునుగా కొందరు ఉద్యోగులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్యాలయంలో ఎవరితో ఎవరు మాట్లాడుతుంటారు.. ఎవరు ఎక్కడికెళ్తుంటారన్న సమాచారం ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలంటూ సదరు అధికారి తన ‘గ్యాంగ్’కు పురమాయిస్తుండటంతో వాళ్లు అదే ‘పని’గా భావిస్తూ తమ ప్రాభవాన్ని చాటుకుంటున్నారు. సహజంగా అధికారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగుల పట్ల కింది స్థాయి ఉద్యోగులకు కాసింత అసహనం ఉంటుంది.
అయితే ఇక్కడ మాత్రం ఇది తారస్థాయికి చేరింది. జిల్లా ఉన్నతాధికారిగా కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక దృష్టి పెడితే వ్యవస్థలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. లేకుంటే పరువు కాస్తా బజారుపాలు కావాల్సిందేనని అంటున్నారు.
డీఆర్‌డీఏలో హైడ్రామా
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగులో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. గత నెలలో కలెక్టర్ సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టిన బదిలీలు కాదని తాజాగా డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు చేపట్టిన బదిలీల ప్రక్రియ వివాదాస్పదమైంది. కొందరు ఏపీఎంలు, సీసీల పనితీరును పక్కకుపెట్టి అయిన వారికి కట్టబెట్టడంలో డీఆర్‌డీఏ అధికారులు చక్రం తిప్పిన వైనంపై ‘బదిలీల మాయ’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
దీంతో గురువారం అధికారులు ఉపశమన చర్యలకు దిగారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడి సైతం మొదలైనట్లు తెలిసింది. అనంతపురం రూరల్ పోస్టును తమ వాళ్లకే కట్టబెట్టాలని ఓ మంత్రి అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అయింది. మొదట అనుకున్నట్టుగానే ఎనిమిదేళ్లపాటు కార్యాలయంలోనే పని చేసిన హరిప్రసాద్‌ను ఇక్కడకు నియమించినట్లు తెలిసింది.
ఇటీవల జరిగిన బదిలీల్లో ఈయన్ను పుట్టపర్తికి బదిలీ చేయగా డీఆర్‌డీఏలోని ఓ కీలక అధికారి అండదండతో మళ్లీ ఇక్కడికే వచ్చారు. ఇక టీటీడీసీ మేనేజర్ పోస్టుకు సంబంధించి సెర్ప్ సీఈఓకు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. పెనుకొండ నియోజకవర్గంలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని హిందూపురం నియోజకవర్గంలోని ఓ మండలానికి మార్పు చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement