pd venkateswarlu
-
అర్హులందరికీ డ్రిప్ యూనిట్లు
అనంతపురం అగ్రికల్చర్: అర్హులైన రైతులందరికీ డ్రిప్ యూనిట్లు అందించడానికి వీలుగా వచ్చే వారంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక పరిశీలన (పీఐఆర్) చేపట్టాలని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఐ ఇంజనీర్లు, ఎంఐఏఓలు, కంపెనీ డీసీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన డ్రిప్ రిజిష్ట్రేషన్ వారోత్సవాల్లో వచ్చిన 12 వేల దరఖాస్తులను మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాథమికంగా అన్ని అంశాలు పరిశీలించి అర్హత జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు జిల్లా అంతటా పీఐఆర్ వారోత్సవాలు చేపట్టాలని ఆదేశించారు. బోర్లలో నీళ్లు వస్తున్నట్లు రైతుల ఫొటోతో పీఐఆర్ జాబితా తయారు చేయాలన్నారు. మరోపక్క రిజిష్ట్రేషన్ల నమోదు కొనసాగించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 85,134 హెక్టార్లకు డ్రిప్ కోసం ఆన్లైన్ రిజిష్ట్రేషన్లు చేసుకోకగా, అందులో అనంతపురం జిల్లాలో 31,340 హెక్టార్లకు రైతులు రిజిస్ర్టేషన్ చేసుకున్నారన్నారు. ఈ సంఖ్యను ఇంకా పెంచగలిగితే ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించడానికి వీలవుతుందన్నారు. ఈ ఏడాది 31,750 హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1,667 మంది రైతులకు 2,011 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు మంజూరు చేశామన్నారు. 2016–17కు సంబంధించి మంజూరు చేసి, ఇన్స్టాల్ చేసిన డ్రిప్ యూనిట్లకు చివరి పరిశీలన నివేదిక (ఎఫ్ఐఆర్) సమర్పించాలని ఆదేశించారు. -
అనంతలో రేపు జాబ్‌మేళా
అనంతపురం : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 30 జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరులోని మొబైల్ కంపెనీలో పని చేయడానికి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. వేతనం రూ.9,500 ఉంటుందని, 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న యువతులు మేళాకు హాజరు కావాలన్నారు. బెంగళూరులోని ఐటీసీ, స్నయిడర్, బిగ్ బాస్కెట్ సంస్థల్లో పని చేయడానికి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న పురుషులకు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం శివారులోని టీటీడీసీలో ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామని, ఇతర వివరాలకు 08554–271122 నంబర్లో సంప్రదించాలన్నారు. అభ్యర్థులు బయోడేటా ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. -
జీతాల గోల
– డీఆర్డీఏలో మూడు నెలలుగా అందని వేతనాలు – ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు – పట్టించుకోని ఉన్నతాధికారులు అనంతపురం టౌన్ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లోని ఉద్యోగుల పరిస్థితి. జీతాల కోసం బడ్జెట్ విడుదలైనా ఖాతాల్లో జమ కాకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి Ðð ళ్తే.. డీఆర్డీఏలో ఈఓఆర్డీ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఏఓ, సూపరింటెండెంట్, డ్రైవర్లు, అటెండర్లు, స్వీపర్లు ఇలా అన్ని క్యాడర్లు కలిపి సుమారు 27 మంది వరకు ఉన్నారు. వీరందరూ మూడు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. స్కూళ్లు ప్రారంభమైన వేళ కొందరు అప్పులు చేసి పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకున్న దయనీయ స్థితి. రెండు నెలల కిందట జీతాల కోసం సెర్ప్ నుంచి బడ్జెట్ విడుదలైంది. ఓ దఫా రూ.22 లక్షలు, మరో దఫా రూ.15.50 లక్షల వరకు వచ్చింది. అయితే జీతాలకు సంబంధించి ట్రెజరీకి బిల్లు పెట్టే ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ట్రెజరీకి వెళ్లాల్సిన సంబంధిత అధికారి తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రూపు తగాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కీలక అధికారికి సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగి ట్రెజరీకి వెళ్లే విషయంలో అనాసక్తి చూపుతున్నట్లు తెలిసింది. గతంలో కలెక్టర్ కోన శశిధర్ చొరవ తీసుకోవడంతోనే జీతాల సమస్య పరిష్కారమైనట్లు సమాచారం. గాడితప్పిన ఈ వ్యవహారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. –––––– రెండు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.. ఉద్యోగులకు మే, జూన్ నెల జీతం పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ట్రెజరీకి బిల్లు పెట్టాం. అక్కడి అధికారులతో నేనే స్వయంగా మాట్లాడాను. రూ.22 లక్షలకు ఒకే అయింది. మిగతాది కూడా అవుతుంది. రెండు, మూడ్రోజుల్లో జీతాలు అందుతాయి. – వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ–వెలుగు పీడీ -
విభజించు.. పాలించు !
డీఆర్డీఏ వెలుగులో ఓ అధికారి తీరిది రెండు వర్గాలుగా ఉద్యోగులు గాడితప్పుతున్న పాలన అనంతపురం టౌన్ : ఏ శాఖలో అయినా అధికారంటే కింది స్థాయి ఉద్యోగులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సరిచేసుకోవాలని సుతిమెత్తగా చెప్పడం.. ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్‌కు తోడ్పడం పరిపాటే. కానీ అనంతపురం జిల్లా గ్రామీణాభివృద్ధి వెలుగులో ఉన్న ఓ అధికారి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తుండటంతో ఉద్యోగులు రెండు వర్గాలయ్యారు. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో కొందరు అమాయకులు బలవుతుండగా..మరికొందరు మాత్రం మానసిక వ్యథను అనుభవిస్తున్నారు. పైకి చెప్పుకోవడానికి కూడా జంకుతున్న పరిస్థితి. కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు నిత్యం తమ పబ్బం గడుపుకోవడం కోసం లేనిపోని సమస్యలను సృష్టిస్తుంటార న్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారి వ్యవహార శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టి తన పరిధిలోని పాలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన అధికారి మొక్కుబడిగా కార్యాలయానికి వస్తుండటం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ఇదే అదునుగా కొందరు ఉద్యోగులు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. కార్యాలయంలో ఎవరితో ఎవరు మాట్లాడుతుంటారు.. ఎవరు ఎక్కడికెళ్తుంటారన్న సమాచారం ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలంటూ సదరు అధికారి తన ‘గ్యాంగ్’కు పురమాయిస్తుండటంతో వాళ్లు అదే ‘పని’గా భావిస్తూ తమ ప్రాభవాన్ని చాటుకుంటున్నారు. సహజంగా అధికారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగుల పట్ల కింది స్థాయి ఉద్యోగులకు కాసింత అసహనం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఇది తారస్థాయికి చేరింది. జిల్లా ఉన్నతాధికారిగా కలెక్టర్ కోన శశిధర్ ప్రత్యేక దృష్టి పెడితే వ్యవస్థలో కాస్త మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. లేకుంటే పరువు కాస్తా బజారుపాలు కావాల్సిందేనని అంటున్నారు. డీఆర్డీఏలో హైడ్రామా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగులో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది. గత నెలలో కలెక్టర్ సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా చేపట్టిన బదిలీలు కాదని తాజాగా డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు చేపట్టిన బదిలీల ప్రక్రియ వివాదాస్పదమైంది. కొందరు ఏపీఎంలు, సీసీల పనితీరును పక్కకుపెట్టి అయిన వారికి కట్టబెట్టడంలో డీఆర్డీఏ అధికారులు చక్రం తిప్పిన వైనంపై ‘బదిలీల మాయ’ శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అధికారులు ఉపశమన చర్యలకు దిగారు. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిడి సైతం మొదలైనట్లు తెలిసింది. అనంతపురం రూరల్ పోస్టును తమ వాళ్లకే కట్టబెట్టాలని ఓ మంత్రి అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నానికి సీన్ రివర్స్ అయింది. మొదట అనుకున్నట్టుగానే ఎనిమిదేళ్లపాటు కార్యాలయంలోనే పని చేసిన హరిప్రసాద్‌ను ఇక్కడకు నియమించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఈయన్ను పుట్టపర్తికి బదిలీ చేయగా డీఆర్డీఏలోని ఓ కీలక అధికారి అండదండతో మళ్లీ ఇక్కడికే వచ్చారు. ఇక టీటీడీసీ మేనేజర్ పోస్టుకు సంబంధించి సెర్ప్ సీఈఓకు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. పెనుకొండ నియోజకవర్గంలో పని చేస్తున్న ఓ ఉద్యోగిని హిందూపురం నియోజకవర్గంలోని ఓ మండలానికి మార్పు చేసినట్లు తెలిసింది. -
మెప్మా.. ఇదేంటమ్మా?
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: పేదరిక నిర్మూలనకు కృషి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన మెప్మా అధికారులు వింత పోకడలకు తెరదీశారు. ఇక్కడ పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రెగ్యులర్ అధికారుల వరకు ప్రతి ఫైల్‌కు ఓ రేటు నిర్ణయించి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసూళ్ల దందాతో మహిళా సంఘాల సభ్యులు విసుగెత్తి పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రజల నుంచి వసూలు చేస్తుండగా పైస్థాయి వారు సంబంధిత ఉద్యోగుల నుంచి అప్పనంగా రాబట్టుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. కింది స్థాయిలో జరిగే అక్రమాలపై మెప్మా జిల్లా అధికారులు ప్రశ్నించాల్సింది పోయి మిన్నకుండి పోతున్నారు. పైగా వారే చేయి చాచి అడుక్కునే పరిస్థితికి దిగజారారని పలువురు ఆరోపిస్తున్నారు. మా దృష్టికి రాలేదు : వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ కార్యాలయంలోని ఉద్యోగులపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని మెప్మా పీడీ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఎండీకీ ఫిర్యాదు చేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. సూర్యాపేట, మిర్యాలగూడ సిబ్బందిపై ఫిర్యాదులు అందితే.. కలెక్టర్‌కు నివేదించామని వివరించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.