అనంతపురం అగ్రికల్చర్: అర్హులైన రైతులందరికీ డ్రిప్ యూనిట్లు అందించడానికి వీలుగా వచ్చే వారంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక పరిశీలన (పీఐఆర్) చేపట్టాలని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఏపీడీలు ఆర్.విజయశంకరరెడ్డి, జి.చంద్రశేఖర్, ఎంఐడీసీ సత్యనారాయణమూర్తితో కలిసి ఎంఐ ఇంజనీర్లు, ఎంఐఏఓలు, కంపెనీ డీసీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన డ్రిప్ రిజిష్ట్రేషన్ వారోత్సవాల్లో వచ్చిన 12 వేల దరఖాస్తులను మరోసారి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రాథమికంగా అన్ని అంశాలు పరిశీలించి అర్హత జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు జిల్లా అంతటా పీఐఆర్ వారోత్సవాలు చేపట్టాలని ఆదేశించారు.
బోర్లలో నీళ్లు వస్తున్నట్లు రైతుల ఫొటోతో పీఐఆర్ జాబితా తయారు చేయాలన్నారు. మరోపక్క రిజిష్ట్రేషన్ల నమోదు కొనసాగించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 85,134 హెక్టార్లకు డ్రిప్ కోసం ఆన్‌లైన్ రిజిష్ట్రేషన్లు చేసుకోకగా, అందులో అనంతపురం జిల్లాలో 31,340 హెక్టార్లకు రైతులు రిజిస్ర్టేషన్ చేసుకున్నారన్నారు. ఈ సంఖ్యను ఇంకా పెంచగలిగితే ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించడానికి వీలవుతుందన్నారు. ఈ ఏడాది 31,750 హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 1,667 మంది రైతులకు 2,011 హెక్టార్లకు సరిపడా డ్రిప్ యూనిట్లు మంజూరు చేశామన్నారు. 2016–17కు సంబంధించి మంజూరు చేసి, ఇన్‌స్టాల్ చేసిన డ్రిప్ యూనిట్లకు చివరి పరిశీలన నివేదిక (ఎఫ్‌ఐఆర్) సమర్పించాలని ఆదేశించారు.
అర్హులందరికీ డ్రిప్ యూనిట్లు
Published Sat, Jul 22 2017 9:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM
Advertisement
Advertisement