జీఎస్టీ గుబులు
Published Wed, Jun 14 2017 12:23 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
భీమవరం/తాడేపలి్లగూడెం : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యాపార వర్గాల్లో సెగ పుట్టిస్తోంది. జూలై 1నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను విధానం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. కొన్ని వస్తువులకు పన్ను మినహాయింపులు, మరికొన్ని వస్తువులకు శ్లాబ్ రేట్లు పెంచనున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు పన్నుల ద్వారా లభించే ఆదాయంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీపై జిల్లాలోని అన్నిరకాల వ్యాపారులకు అవగాహన కల్పించే పనిలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ధాన్యం, బియ్యం, గోధుమలు, వాటితో చేసే ఉత్పత్తులు, అపరాలు, పప్పులు, అగరుబత్తి, స్కూల్ బ్యాగ్‌లు, ప్యాకేజ్డ్ ఆహారం వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహా యింపు ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయ చేతి పనిముట్లు, దివ్యాంగులు వినియోగించే వస్తువులు, ఆక్వా, పౌల్ట్రీ ఫీడ్, తమలపాకులు, బార్లీ, తృణ ధాన్యాలు, పెరుగు, మజ్జిగ వంటి పాల పదార్థాలు, వంట చెరకు, కూరగాయలు, మరమరాలు వంటి వాటికీ మినహాయింపు లభించనుంది. మిర్చి, పత్తి, కాఫీ, టీ, ఖనిజాలు తదితర వస్తువులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నులే జీఎస్టీలో కొనసాగుతాయని సమాచారం. జీఎస్టీ అమల్లోకి వస్తే స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. దీర్ఘకాలంలో వస్తు ఉత్పాదక వ్యయం తగ్గి స్థానికంగా తయారయ్యే వస్తువులు వినియోగదారులకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కార్యకలాపాలు ఆన్‌లైన్
జీఎస్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయి. ఈ చట్టం కింద వ్యాపారులు దాఖలు చేసే రిటర్న్స్, చెల్లించే పన్నుల ఆధారంగా వారికి రేటింగ్ ఇస్తారు. దీనివల్ల వ్యాపార కార్యాకలాపాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు, వ్యాపారులకు, ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఒకే రకమైన పన్ను అమలు కావడం వల్ల పన్ను చెల్లించాలి్సన అవసరం నేరుగా వినియోగదారులకు ఉండదు. ఏకీకృత పన్నుల వ్యవస్థ వల్ల వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. చిన్న వ్యాపార సంస్థలకు నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. పన్ను వసూలు సులభతరమై బకాయిలు, చట్టపరమైన వివాదాలు తగ్గుతాయనేది అధికారుల భావన. జీఎస్టీ అమల్లోకి వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సరుకులపై కూడా ఇన్‌పుట్ టాక్స్‌లు పొందేందుకు వ్యాపారులకు అర్హత ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాట్ చట్టం ప్రకారం నిల్వ ఉన్న ఇన్‌పుట్ టాక్స్‌ను జీఎస్టీ చట్టం అమలు తరువాత తిరిగి పొందవచ్చు. ఇప్పటికే 90 శాతానికి పైగా వ్యాపారులు జీఎస్టీ పరిధిలోకి వచ్చారు. విదేశాలకు ఎగుమతి చేసిన సరుకులు, సేవలపై కట్టిన పన్ను వాపస్ ఇస్తారు. అదనంగా లేదా పొరపాటున చెల్లించిన పన్నును కూడా వ్యాపారులు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారానే నడుస్తుంది.
అనుమానాలెన్నో..
జీఎస్టీ విధానంపై వ్యాపారులను అనేక అనుమానాలు చుట్టుముడుతున్నాయి. సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. తమ అనుమానాలను అవగాహన సదస్సుల్లో అడుగుతుంటే. అధికారులు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా ప్రస్తుతం సాగుతున్న జీరో వ్యాపారాన్ని అధికారులు జీఎస్టీ ద్వారా ఏవిధంగా నియంత్రిస్తారన్నది అర్థం కాని సమస్యగా ఉంది. ఇప్పటికీ అనేక వ్యాపార సంస్థల్లో వ్యాట్‌లో నమోదు చేయని సరుకుల నిల్వలు భారీగా ఉన్నాయి. జూలై 1నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తే వాటిని ఏ విధంగా చూపిం చాలనే సందేహం వ్యాపారుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పన్నుల శ్లాబులు జీఎస్టీ వల్ల మారనున్నాయి. అదనంగా పెరిగే పన్నులను ఏవిధంగా చెల్లించాలనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటివరకు మామూళ్లకు అలవాటు పడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జీఎస్టీ అమలైతే తమ ఆదాయానికి గండి పడుతుందనే ఆందోళనలో ఉన్నారు.
జీఎస్టీ నాలుగు రకాలు
జీఎస్టీ విధానంలో నాలుగు రకాలు ఉంటాయని చెబుతున్నారు. సీజీఎస్టీ (సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ) ఎస్‌జీఎస్టీ (స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ ) యూజీఎస్టీ (కేంద్రపాలిత ప్రాంతాల జీఎస్టీ) ఐజీఎస్టీ (ఇంటర్ స్టేట్ జీఎస్టీ)గా వీటిని పిలుస్తారు. ఈ నాలుగింటిలో ఐజీఎస్టీ ఆదాయం కేంద్రం వద్దే ఉంటుంది. ఉదాహరణకు ముంబైలో తయారైన వస్తువు ఆంధ్రప్రదేశ్‌లో విక్రయించగా వచ్చే పన్నును ఏ దామాషాలో అక్కడి తయారీదారుకు, ఇక్కడి విక్రేతకు విధించాలనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. మిగిలిన మూడు రకాల పన్నులను మార్గదర్శకాలకు అనుగుణంగా విధిస్తారు.
రివర్స్ చార్జి మెకానిజం
జీఎస్టీ లావాదేవీలన్నీ ఈ–ఇన్‌పుట్ ద్వారా సాగించాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్నిరకాల ఆవర్జా పుస్తకాలు నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమ్మకాలు, కొనుగోలు విషయాలకు సంబంధించి పన్ను రాయితీకి కొన్ని విధివిధానాలు నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఒక రిటైల్ వ్యాపారి హోల్‌సేల్ వ్యాపారి నుంచి రూ.5 లక్షల విలువైన సరుకును కొనుగోలు చేస్తే.. అది హోల్‌సేల్ వ్యాపారి అమ్మకాల్లోకి వెళ్లి రూ.5 లక్షల అమ్మకాలకు సంబంధించి జీఎస్టీ పన్ను చెల్లింపుల్లోకి వెళుతుంది. రిటైల్ వ్యాపారి రూ.లక్ష విలువైన సరుకును వెనక్కి ఇస్తే ఎలక్ట్రానిక్ ఇన్‌పుట్‌లో ఆ విషయాన్ని పొందుపరిస్తే.. ఆ మేరకు జీఎస్టీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. రివర్స్ చార్జ్ మెకానిజమ్‌గా ఈ లావాదేవీలను చూపించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం సీజీఎస్టీగా అత్యధికంగా 20 శాతం పన్ను విధించవచ్చు. ఎస్‌జీఎస్టీగా కూడా 20 శాతం పన్ను వేయవచ్చు. ఐజీఎస్టీగా మాత్రం అత్యధికంగా 40 శాతం పన్ను వసూలు చేయవచ్చని సమాచారం. జీఎస్టీపై దఫదఫాలుగా వాణిజ్య పన్నుల విభాగం అధికారులకు, ఉద్యోగులకు, చార్టర్డ్ అకౌంటెంట్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. అప్పటికి గాని జీఎస్టీపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు.
Advertisement
Advertisement