జూలై నుంచి జీఎస్టీ అమలుకు కేంద్రం అంగీకారం: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను వచ్చే జూలై నుంచి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. జూలై నుంచి జీఎస్టీని అమలుపరచడానికి అన్ని రాష్ట్రాలు సూచనప్రాయంగా అంగీకరించాయని, కౌన్సిల్ తదుపరి సమావేశంలో ఈ విషయంపై జైట్లీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఈటల వెల్లడించారు.
జీఎస్టీకి సంబంధించి 99% సమస్యలు ఈ సమావేశంలో పరిష్కారమయ్యాయని, సామాన్యులపై భారం పడకుండా చూడాలని, వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను వేయవద్దని నిర్ణయించామన్నారు. రాష్ట్రాలకు, కేంద్రానికి మధ్య సందిగ్ధత ఉన్న అన్ని విషయాల్లో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల సంయుక్త నియంత్రణ అంశంపై తుది నిర్ణయానికి వచ్చామని, రూ.1.5 కోట్లు, అంతకంటే తక్కువ టర్నోవర్ ఉండే వ్యాపారంపై పన్ను వసూలు 90% వరకూ రాష్ట్రాలు చేపడతాయని, 10% కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉండే వ్యాపారాలపై కేంద్రం, రాష్ట్రాలు 50% చొప్పున నియంత్రణ కలిగి ఉండాలనే ప్రతిపాదనకు కౌన్సిల్ అంగీకరించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయని తెలిపారు. కౌన్సిల్ తదుపరి సమావేశం ఫిబ్రవరి 18న జరుగుతుందని చెప్పారు.