సాక్షి, హైదరాబాద్: భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నూతన మార్గదర్శకాల ప్రకారం కరోనా పాజిటివ్ వ్యక్తులను 10 రోజులపాటు చికిత్స అందించాక ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేయవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తాజాగా పలు కీలక మార్పులతో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసిందని, వాటి ప్రకారం డిశ్చార్జి పాలసీ, హోం ఐసోలేషన్, డెత్ గైడ్‌లైన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిశ్చార్జి అయిన వారిని మరో వారంపాటు హోం ఐసోలేషన్‌లో ఉంచాలని తెలిపిందన్నారు. ఒకవేళ లక్షణాలు ఎక్కువగా ఉన్న, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులను మాత్రం ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ పేర్కొందన్నారు.
హోం ఐసోలేషన్ కోసం ఈ నెల 10న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ (తృతీయ) కాంటాక్టులను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలన్నారు. ఇందుకోసం ఇంట్లో ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారికి సాయం కోసం ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలా సహాయం అందిస్తున్న వ్యక్తికి హెచ్‌సీక్యూ మాత్రలు అందించాలని ఐసీఎంఆర్ సూచించిందని ఈటల చెప్పారు. 17 రోజులపాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఉదయం, సాయంత్రం వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తాయని, అవసరమైన నిత్యావసర వస్తువులను జీహెచ్‌ఎంసీ ద్వారా అందిస్తామని మంత్రి తెలిపారు.
ఆ జబ్బులతో మరణిస్తే కరోనాకు సంబంధంలేదు...
ఐసీఎంఆర్ తాజా మార్గదర్శకాల ప్రకారం కేన్సర్, గుండె జబ్బులు లేదా ఇతర జబ్బులతో మరణించిన వారికి కరోనా పాజిటివ్ ఉన్నా దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని మంత్రి ఈటల చెప్పారు. ఈ మరణాలకు కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకా రమే మరణాలను ప్రకటించాలని ఐసీఎంఆర్ తెలిపిందన్నారు. అయితే పాజిటివ్ కేసులు, మరణాలు దాస్తే దాగవని పేర్కొన్నారు.
అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు...
రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ టల తెలిపారు. హైదరాబాద్‌లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్ సోకడం వల్లే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వారందరికీ చికిత్స అందిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment