‘గుడా’ తో గ్రామీణాభివృద్ధి సాధ్యం
-
చైర్మన్ గన్ని కృష్ణ
-
13 మండలాల కార్యదర్శులకు అవగాహన సదస్సు
-
నేడు కాకినాడలో మరో 13 మండలాలకు..
రాజమహేంద్రవరం సిటీ :
గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరిగి, అభివృద్ధి సాధ్యమౌతుందని చైర్మన్ గన్నికృష్ణ పేర్కొన్నారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో గల 13 మండలాలకు చెందిన పంచాయితీ కార్యదర్శులు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ‘గుడా’ వల్ల గ్రామాల్లో ప్రజలపై భారం పడుతుందనే అపోహలు పూర్తిగా విడిచిపెట్టాలన్నారు. ‘వుడా’ ఏర్పాటుతో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ‘గుడా’ పరిధిలోని అన్ని మండలాల్లో పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు గుడాపై పూర్తి అవగాహన కలిగి ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. గుడా వైస్ చైర్మన్, కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ గుడా పరిధిలోని 26 మండలాల్లో 253 పంచాయతీలుండగా వాటిలో మొదటి దఫాగా 13 మండలాలకు రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని మిగిలిన, 13 మండలాలకు గురువారం కాకినాడలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై గ్రామాల్లో ప్రజలు నిర్మాణం చేయాలంటే అన్ని ఆన్‌లైన్ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. 300 స్క్వేర్ మీటర్ల కన్నా తక్కువ స్థలం ఉన్న వారికి స్థానిక పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇస్తారని, అది దాటితే గుడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు అవకతవకలకు పాల్పడితే రెండేళ్లు బ్లాక్ లిస్ట్‌లో పెడతానని హెచ్చరించారు. గుడా సభ్యులు గట్టి సత్యనారాయణ, నాని, రవి, టౌన్ ప్లానింగ్ ఆర్‌జేడీ సాయిబాబా పాల్గొన్నారు.